JP NADDA AP TOUR: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన రాజకీయ కాక రేపుతోంది. ఇప్పటికే తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్.. ఏపీపైనా దృష్టి సారించింది. అందులో భాగంగానే రెండు రోజుల పాటు ఏపీలోనే ఉండబోతున్నారు జేపీ నడ్డా. ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకుంటారు నడ్డా. రాష్ట్రస్థాయి శక్తి కేంద్ర ప్రముఖ్ తో సమావేశమవుతారు. సోమవారం సాయంత్రం విజయవాడ మేధావుల సమావేశానికి హాజరవుతారు జేపీ నడ్డా. మంగళవారం రాజమండ్రి వెళతారు. ఏపీ బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీలో ప్రస్తుతం పొత్తులపై రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పర్యటనలో పొత్తులపై జేపీ నడ్డా క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు.
ఏపీలో ప్రస్తుతం బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే కొన్ని రోజులుగా పొత్తులకు సంబంధించి కీలక ప్రకటనలు చేస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ పదేపదే చెబుతున్నారు. పవన్ కామెంట్లతో వైసీపీని ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం సాగుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా పొత్తులకు సిద్ధమని.. త్యాగాలకు సిద్ధమనే సంకేతం ఇచ్చారు. టీడీపీ నేతలు కూడా పొత్తులు ఖాయమనేలా మాట్లాడుతున్నారు. దీంతో 2014 తరహాలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడుతాయని రాజకీయ వర్గాల్లో బలంగా టాక్ వినిపిస్తోంది. కాని ఏపీ బీజేపీ నేతలు మాత్రం జనసేనతో ఓకే కాని.. టీడీపీతో పొత్తు ఉండదని చెబుతున్నారు. సోము వీర్రాజు, జీవీఎల్ వంటి నేతలు టీడీపీతో పొత్తు ఉండదని కుండబద్దలు కొడుతుండగా.. మరికొందరు ఏపీ కమలం లీడర్లు మాత్రం ఏదైనా జరగవచ్చంటూ టీడీపీతో పొత్తుకు అవకాశం ఉందని అంటున్నారు.
పొత్తులపై చర్చలు సాగుతుండగానే మరో అంశం హాట్ హాట్ గా మారింది. కూటమి ఏర్పడితే ముఖ్యమంత్రి ఎవరన్నదే చర్చ. బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఉంటారనే ప్రచారం చాలా రోజులుగా ఉంది. ఏపీ బీజేపీ చీఫే గతంలో స్వయంగా ఈ ప్రకటన చేశారు. మూడు పార్టీలు కలిస్తే మాత్రం సీఎంగా ఎవరూ ఉండాలనేది తేలడం లేదు. ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకునే సాహసం టీడీపీ చేయబోదని తెలుస్తోంది. అందుకే సీఎం పదవిపై టీడీపీ నేతలు ఎక్కడా మాట్లాడటం లేదు. తాజాగా జనసేన నేతలు సీఎం అభ్యర్థిపై ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. తన నేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. టీడీపీతో పొత్తు సంగతి ఎలా ఉన్నా.. ముందు బీజేపీ తమ నేతను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేయాలని జనసేన నేతలు కోరుతున్నారు. దీంతో రాజమండ్రి సభలో జేపీ నడ్డా కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ను బీజేపీ-జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారని టాక్. అందుకే నడ్డా టూర్ రాజకీయంగా ప్రాధాన్యతగా మారింది.
మరోవైపు జేపీ నడ్డా పర్యటన తెలుగుదేశం పార్టీకి కీలకంగా మారింది. జనసేనతో పొత్తు పెట్టుకోవాలనే యోచనలో ఉన్న చంద్రబాబు.. నడ్డా పర్యటనలో ఏం జరగబోతుందని ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. పవన్ ను సీఎం అభ్యర్థిగా నడ్డా ప్రకటిస్తే... బీజేపీ-జనసేన కలిసిపోటీ చేస్తాయి. అప్పుడు టీడీపీ వాటితో కలవడం కష్టమే. ఒకవేళ కలిసినా పవన్ ను కూటమి ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు అంగీకరించాల్సి ఉంటుంది. ఇందుకు టీడీపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఏపీలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని భావిస్తున్న టీడీపీ.. తమకు అధికారం ఖాయమనే ధీమాలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం సీటును త్యాగం చేసే ఆలోచన చంద్రబాబు చేయబోరనే టాకే రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. మొత్తంగా జేపీ నడ్డా పర్యటనతో ఏపీలో పొత్తులపై క్లారిటీ రావచ్చని తెలుస్తోంది.
Read also: AP 10th Results: ఏపీలో రేపే పదో తరగతి ఫలితాలు..విడుదల చేయనున్న మంత్రి బొత్స..!
Read also: Monkeypox: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్.. కట్టడికి కీలక సూచనలు చేసిన WHO
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook