Pawan Kalyan Visits Mallavalli: 'పరిశ్రమలు రావాలి.. యువతకు ఉపాధి అవసరమే. అయితే ఆ పరిశ్రమలకు భూములు ఇచ్చే రైతులకు అన్యాయం జరిగితే మాత్రం జనసేన పార్టీ ఊరుకోదు. అన్యాయం జరిగిన ప్రతి రైతు తరపున బలంగా పోరాడుతుంది. గన్నవరం నియోజకవర్గం, మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతులు వారాహి విజయయాత్రలో నేను ఏలూరులో ఉన్నప్పుడు నన్ను కలిశారు. తమ భూములకు పరిహారం అడిగితే, పోలీసులు దాడి చేశారంటూ మెడ విరిగి ఒకరు, కాలి గాయంతో మరొకరు నా దగ్గరకు వచ్చారు. ఆ రైతుల ఒంటి మీద ఉన్న దెబ్బలు నా మనసుకి బలంగా తాకాయి' అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. న్యాయం అడిగిన రైతులపై దాడి చేయడం తనపై జరిగినట్లే భావించానని అన్నారు.
ఈ రోజు మల్లవల్లి రైతులకు జరిగిన అన్యాయం మనకు సంబంధం లేదని అనుకోవద్దు.. ఆ సమస్య రేపు మన గడప వరకు వస్తుందన్నారు. మన హక్కుల కోసం మనం ఐక్యంగా లేకపోతే, బలమున్న ప్రతి ఒక్కడూ మనకి అన్యాయం చేస్తాడని గుర్తుంచుకోవాలన్నారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామికవాడ భూసేకరణలో పరిహారం అందక అన్యాయమైన రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం పవన్ కళ్యాణ్ స్వయంగా మల్లవల్లిలో పర్యటించారు. భూములు కోల్పోయి పరిహారం అందని రైతులతో మాట్లాడారు.
రైతుల కష్టాలు, వారి పోరాటాలు, ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు, పోలీసులు చేసిన దాడులను రైతులు జనసేనానితో ముందు మొర పెట్టుకున్నారు. చాలామంది నాయకులను ఇప్పటి వరకు కలిశామని, ఏ ఒక్కరూ తమ గోడు పట్టించుకున్న వారు లేరంటూ కన్నీరు మున్నీరయ్యారు. రైతుల కష్టాలను విన్న పవన్ కళ్యాణ్ అందరికీ న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సహజ వనరులు అనేవి ఏ ఒక్కరి సొంతం కాదని అన్నారు. అది ఉమ్మడి ఆస్తి అని. అంతా నాదే.. సమస్తం మాదే అనుకుంటే కుదరదని అన్నారు. రాజ్యంగంలోనూ సహజ వనరులు మీద ఏ ఒక్కరికీ ప్రత్యేక హక్కులు కల్పించలేదన్నారు. పారిశ్రామికవాడ కోసం ప్రభుత్వం తీసుకున్న భూములకు పూర్తి స్థాయి పరిహారం ఇవ్వలేదు. దీంతో నష్టపోయిన రైతులంతా పోరాడుతుంటే ఇప్పటి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వారి వేదన వినకపోవడం దుర్మార్గం అని అన్నారు. 2013 భూ సేకరణ చట్టం న్యాయబద్ధంగా నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
"గత టీడీపీ ప్రభుత్వంలోనే మల్లవల్లి రైతుల భూములు తీసుకున్నారు. ఇప్పుడు వారికి అన్యాయం జరుగుతోంది. రైతులకు పార్టీలు, కులాలు అంటగట్టి విభజిస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ సమస్య ఈ రోజు మల్లవల్లి రైతులది అయితే, తర్వాత మరో ప్రాంతంలోనూ ఇలాంటి సమస్య వస్తుంది. రైతుల సమస్యపై బీజేపీ, టీడీపీ నాయకులు కూడా స్పందించాలి. వారికి న్యాయం జరిగేలా అంతా సంఘటితం కావాలి. భూములను పసుపు కుంకుమ కింద ఆడబిడ్డలకు ఇచ్చిన వారికి, పరిహారం అందకపోతే ఆడ బిడ్డలను మళ్లీ పుట్టింటికి పంపుతున్నారు. దీంతో ఇది కుటుంబాల్లో చిచ్చు రేపే సామాజిక సమస్య అవుతుంది.
మల్లివల్లి రైతుల పోరాటంలో స్థానిక జనసేన నాయకులు వారి కోసం పోరాడారు. ఏడుగురు నేతలు జైలుకు వెళ్లారు. జనసేన బలంగా పోరాడుతుంది. ఈ సమస్య మాది కాదు.. వీళ్లు మాకు ఓట్లేయలేదు అని చూడం. సమస్య ఉంటే అక్కడ జనసేన పార్టీ పోరాటం బలంగా పోరాడుతుంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిజాయతీగా నిలబడతాం. ప్రజలకు అండగా నిలబడే జనసేనకు ఈ సారి ప్రజలు అండగా నిలబడాలి. మల్లవల్లి రైతులకు మొదటి నుంచి బలంగా నిలబడిన జనసేన నాయకులు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నాను. యువతకు సైతం సమస్య మనది కాదని వదిలేయకండి. రైతుల తరఫున బలంగా ఉద్యమిద్దాం. నేను మంగళగిరిలోనే నివాసం ఉంటాను. అవసరం అయితే ఉద్యమ కార్యాచరణలోకి ప్రత్యక్షంగా దిగుతాను" అని పవన్ కళ్యాణ్ అన్నారు.