Jagan Anna Thodu Scheme: వరుసగా నాలుగో ఏడాదిలో జగనన్న తోడు

Jagan Anna Thodu Scheme Money: జగనన్న తోడు పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ. 549.70 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,87,492 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలు కింద రూ. 2,955.79 కోట్లు అందించినట్టు ఏపీ సర్కారు స్పష్టంచేసింది. 

Written by - Pavan | Last Updated : Jul 18, 2023, 04:58 AM IST
Jagan Anna Thodu Scheme: వరుసగా నాలుగో ఏడాదిలో జగనన్న తోడు

Jagan Anna Thodu Scheme Money: అమరావతి: నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారిని వాళ్ల కాళ్లమీద వారిని నిలబెడుతూ.. ఒక్కొక్కరికి ఏపీ సర్కారు ఏటా రూ. 10 వేలు రుణంగా అందిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. సకాలంలో ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి ఆ రూ.10,000 కు అదనంగా ఏటా రూ.1,000 చొప్పున కలుపుతూ వస్తోన్న ప్రభుత్వం.. ప్రస్తుతం రూ.13,000 వరకూ వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. వీరి స్వయం ఉపాధికి ఊతమిచ్చే ఉద్దేశంతో పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేలు నుంచి అంతకుపైగా మొత్తాన్ని రుణంగా ఇస్తోంది. అలా ఇప్పటివరకు 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల మేర వడ్డీలేని రుణాలు. రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ.560.73 కోట్లను జులై 18న మంగళవారం నాడు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. 

జగనన్న తోడు పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ. 549.70 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,87,492 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలు కింద రూ. 2,955.79 కోట్లు అందించినట్టు ఏపీ సర్కారు స్పష్టంచేసింది. వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి ఒకటి కంటే ఎక్కువసార్లు రుణం తీసుకున్న లబ్ధిదారుల సంఖ్య 13,29,011 మంది వరకు ఉంది. నేడు అందిస్తున్న వడ్డీ రీయింబర్స్‌‌మెంట్‌ రూ.11.03 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.31 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు వైయస్‌.జగన్‌ ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్లుగా ఉంది.

చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి లేకుండా, వారి పరిస్ధితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతీ 6 నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తోంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించిన తర్వాత లబ్ధిదారులు మళ్ళీ వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు అవుతారు. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీలేని రుణాలు ఇస్తాయి. 

వీరందరికీ జగనన్న తోడు...
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్ధలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్‌ సైకిళ్ళు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు, చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్‌ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు అర్హులు.

సకాలంలో చెల్లిస్తే...
సీఎం వైయస్‌.జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా.. సకాలంలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి నిత్యం మూలధనం అందుబాటులో ఉండేలా.. ఏ ఏడాదికి ఆ ఏడాది రుణాల మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.11వేలకు, రూ.11వేల నుంచి రూ.12వేలకు, రూ.12వేల ఉంచి రూ.13వేలకు పెంచుతూ బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలిప్పిస్తున్న ప్రభుత్వం.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ..
వడ్డీ లేని రుణాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలి. అర్హత ఉండీ, జాబితాలో పేర్లు నమోదు కాని వారు కంగారు పడాల్సిన పనిలేదు. గ్రామ, వార్డు వాలంటీర్లను సంప్రదించవచ్చు లేదా సమీప గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు.

Trending News