సరిగ్గా ఐదేళ్ల క్రితం తిరుపతికి వచ్చిన ప్రధాని మోడీ వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అమలుపై ప్రకటన చేయలేదు. ఈ ఐదేళ్ల కాలం నుంచి రాజకీయ పార్టీలతో పాటు ఏపీ ప్రజలంతా హోదా కోసం నిరసన గళం విప్పినా ఫలితం లేకుండా పోయింది.
బీజేపీ కొంపముంచిన హోదా అంశం
ప్రత్యేక హోదాను కాదని చెప్పిన ఫలితంగా గడిచిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా వెలిగిన బీజేపీ ఏపీలో మాత్రం దారుణ పరాజయం ఎదుర్కొంది. హోదా అంశమే కమలం పార్టీ కొంపముంచిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ గ్రాఫ్ సాధించాలంటే ప్రత్యేక హోదాపై ప్రకటన చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో ప్రధాని మోడీ ఇదే తిరుపతిలో అడుగుపెడుతున్నారు.
హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కన్నా...
సరిగ్గా ఐదేళ్ల తర్వాత ప్రధాని తిరుపతి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సారైనా ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రధాని తిరుపతిలో అడుగుపెట్టకుముందే ఆ ఆశలు ఆవిరయ్యాయి. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయమని తేల్చి చెప్పాడం గమనార్హం. ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో కన్నా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన తిరుపతి పర్యటన సమయంలో హోదా విషయంలో ఆశలు పెట్టుకోవద్దనే ముందుగానే మోడీ ఇలా సంకేతాలు పంపినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
ప్రధాని మోడీకి జగన్ ఒప్పించేనా ?
ఇదిలా ఉండగా రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ ముందు ప్రత్యేక అంశాన్ని ప్రస్తావించి ఆయన్ను ఒప్పించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. జగన్ పార్టీ విజయం సాధించిన సందర్భంలో ప్రధాన మోడీ స్పందిస్తూ ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని..ఏపీకి అండగా ఉండటామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని తిరుపతికి వస్తుండతో ప్రత్యేక హొదో విషయంలో సీఎం జగన్ పట్టుబట్టే అవకాశముంది. ఏపీలో గెలుపు సాధించిన అనంతరం ఢిల్లీ వెళ్లిన సందర్భంగా ప్రధాని మోడీని కలిసిన జగన్.. ప్రత్యేక హోదాతో పాటు ఏపీ పరిస్థితిని వివరించి ఆదుకోవాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ మరో సందర్భంలో చర్చిద్దామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ ముందు సీఎం జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించి ఆయన చేత ఏ మేరకు ఒప్పిస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా చెప్పినట్లు.. ఇక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనా ?