ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను జగన్‌గా ముఖ్యమంత్రి చేయమని అడగనని.. జనసేన కుటుంబ వారసత్వం ఉన్నవాళ్లు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి అనే పద్ధతిని మారుస్తోందని తెలిపారు. మధ్యతరగతి వారు, మేధావులు, సమాజం పట్ల బాధ్యతగా ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
"జనసేన పార్టీకి మీ అభిమానం, ఆడపడుచుల ఆశీస్సులు చాలా ముఖ్యం. మనస్ఫూర్తిగా పార్టీలో చేరండి. సీట్లు ఆశించి అయితే మాత్రం పార్టీలో చేరకండి అని నేను కొత్తవారితో చెప్పా. జనసేన పార్టీ ఎదిగే పార్టీ. ముందుకు వెళ్లే పార్టీ. దోపిడిని అరికట్టే పార్టీ. అవినీతిపై పోరాటం చేసే పార్టీ" అని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని ఐటి హిల్స్‌లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్ కంపెనీలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
"అమెరికాలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హెడ్ ఆఫీసు 5 ఎకరాల్లో ఉంటే.. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు కంపెనీ బ్రాంచి ఆఫీసుకి 25 ఎకరాలు కేటాయించారు. ఐటీ సెక్టారులో ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. కానీ.. రెండు, మూడువేల ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తలు కంపెనీలు పెట్టి, ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని భూములు అడిగితే ఎకరం రూ.2, 3 కోట్లు చెప్పిన ప్రభుత్వం విదేశీ కంపెనీలకు మాత్రం ఎకరా.. 25 లక్షల రూపాయలకు కట్టబెట్టడం ఏమిటని" పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అలాగే కాలుష్య సమస్యపై కూడా పవన్ మాట్లాడారు. కనీసం పోర్టు కాలుష్యాన్ని కూడా ప్రభుత్వం ఆపలేకపోతుంది అని, దానికి కారణమేంటని అడిగారు. స్థానికులకు న్యాయం జరగకపోతే వేర్పాటువాద ఉద్యమం వస్తుందని పవన్ హెచ్చరించారు.