హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది.

Last Updated : Mar 28, 2018, 11:32 AM IST
హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను కాదని మరో వ్యక్తితో వివాహానికి సిద్ధమయిందన్న అక్కసుతో ఓ ఉన్మాది ఓ యువతిని సజీవదహనం చేయడానికి ప్రయత్నించాడు. బాధితురాలు కాలిన గాయాలతో ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని గోల్నాక, గంగానగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి అంబర్‌పేట ఇన్స్‌పెక్టర్ ఏపీ ఆనంద్ కుమార్ అందించిన వివరాల్లోకెళితే, గంగానగర్‌లో నివసించే రియాజ్ ఖాన్, అర్షియా బేగం దంపతుల కుమార్తె (17) చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. గోల్నాక మార్కెట్‌లో వ్యాపారం చేసే మహ్మద్ సోహైల్ (19) ప్రేమ పేరుతో ఆ యువతిని కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి అతన్ని పలుమార్లు మందలించినా ఫలితం లేకపోవడంతో.. వేరే వ్యక్తితో ఆమెకు 15 రోజుల కిందటే నిశ్చితార్థం చేశారు. ఈ సంగతి తెలుసుకున్న సోహైల్ కోపంతో యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండటం తెలుసుకొని అక్కడకు వెళ్లి ఆమెను నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో అక్కడే ఉన్న కిరోసిన్ తీసుకుని ఆమె ఒంటిపై పోసి నిప్పంటించాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని 108లో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సోహైల్‌కు కూడా నిప్పంటుకోవడంతో అతన్ని కూడా గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు

Trending News