ఏపీలో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. ఉదయం నుంచి విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖలో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. క్యుములో నింబస్ మేఘాల వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. మరో 2 రోజుల పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఆ ఒక్కరోజు 41,025 పిడుగులు!
తాజా వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ప్రజలు పిడుగులు, అకాల వర్షాలతో మృత్యువాత పడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 41,025 పిడుగులు పడి 14 మంది మృత్యువాత పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ ఏడాది పిడుగు పోట్లు అధికమయ్యాయి. ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి మే ఒకటి వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏకంగా 1,40,982 పిడుగులు పడ్డాయట. అధికారిక సమాచారం ప్రకారం వీటి వల్ల ఇప్పటివరకు 39 మంది మృత్యువాత పడ్డారు. అధికారుల దృష్టికి రాని మరణాలు ఇంతకంటే ఎక్కువగా ఉంటాయని అంచనా.