సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నట్టు గతంలో చేసిన ప్రకటన అప్పట్లో రాజకీయంగా చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. ఈ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కొత్తగా ఏదైనా రాజకీయ పార్టీని స్థాపిస్తారా లేక మరేదైనా పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారా అనే చర్చలు జరిగాయి. ఇప్పటికీ ఈ విషయంపై ఓ స్పష్టత రాకపోవడంతో ఎప్పటికప్పుడు దీనిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత అధికమైంది. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీ నారాయణ సైతం ఇదే విషయంపై స్పందిస్తూ.. తాను ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు. కొత్త పార్టీ స్థాపించాలా ? లేక మరోదైనా పార్టీలో చేరి ప్రజా సేవ చేయాలా ? అనే విషయంపై ఆలోచిస్తున్నానని అన్నారు. ఏ నిర్ణయమైనా తీసుకోవడానిరకి ఇంకొంత సమయం పడుతుందని చెబుతూ.. ఇప్పటికైతే తనను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఆహ్వానించినప్పటికీ తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
ప్రస్తుతానికి తాను ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదల్చుకున్నట్టు స్పష్టంచేసిన లక్ష్మీనారాయణ.. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నందున సరైన ప్రణాళికలతో తర్వాతి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. దీంతో ఇంతకీ ఆయన ఏదైనా పార్టీలో చేరతారా లేక మరేదైనా కొత్త పార్టీని స్థాపిస్తారా అనే ఉత్కంఠకు ప్రస్తుతానికైతే తెరపడలేదు.