'కరోనా వైరస్' ఉద్ధృతంగా విస్తరిస్తున్న సమయంలో అన్నింటికీ బ్రేక్ పడింది. లాక్ డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం కష్టతరంగా మారింది.
ఈ క్రమంలో జులై నెలాఖరు నాటికి పరిస్థితులు మారే అవకాశం ఉందన్న అంచనాల మధ్య ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తాజాగా ఎంసెట్ తేదీలను ఖరారు చేసింది. జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్ పరీక్షల నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తారు. అలాగే ఈ-సెట్ ను జులై 24న నిర్వహించనున్నారు. జులై 25న ఐ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఎడ్ సెట్ ను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది.
మరోవైపు పదో తరగతి పరీక్షలు నిర్వహించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాతే పదో తరగతి పరీక్షలపై నిర్ణయం ఉంటుందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..