జనసేనతో పొత్తుపై స్పందించిన సీపీఎం

జనసేనతో పొత్తుపై స్పందించిన సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్

Last Updated : Sep 15, 2018, 03:06 PM IST
జనసేనతో పొత్తుపై స్పందించిన సీపీఎం

సినీనటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో సీపీఎం పార్టీతో కలిసి పోటీచేసేందుకు రంగం సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్పందించారు. ఏపీలో జనసేనతో కలిసి టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామని చెబుతూ.. జనసేన పార్టీతో ఎన్నికల్లో పొత్తు ఉండేది లేనిది అక్టోబర్ లో స్పష్టత ఇస్తామని అన్నారు. ఇవాళ విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ బృందా కారత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని ఈ సందర్భంగా బృందా కారత్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, అలాగే జీఎస్టీ రూపంలో ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపారని ఆమె కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల విషయంలో ఇంతకుముందెప్పుడూ లేని విధంగా నరేంద్ర మోదీ సర్కార్ సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంటోందని ఎన్డీఏకు చురకలు అంటించారు. మోదీ తీసుకొచ్చిన ఆర్థిక పరమైన విధానాలు సామాన్యుల నడ్డివిరిస్తే, మోదీ నాలుగేళ్ల పాలనకు మద్దతు పలికిన ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ఇప్పుడొచ్చి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బృందా కారత్ మండిపడ్డారు. 
 

Trending News