కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ గత పదకొండు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్ ఎట్టకేలకు దీక్షను విరమించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆయనకు నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. "తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్షకు పూనుకున్న సీఎం రమేశ్‌కు నా అభినందనలు.
ఆయనతో పాటు దీక్ష చేసిన బీటెక్ రవికి కూడా నా అభినందనలు. వీరిద్దరూ ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటున్నా దీక్ష చేస్తూనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఆరు నెలలలో పరిశ్రమ ప్రారంభించాల్సి ఉన్నా అది కార్యరూపం దాల్చలేదు. మరో రెండు నెలల్లో కేంద్రం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా. ఈ విషయంపై పార్లమెంటులో కూడా పోరాడాల్సిన అవసరం ఉంది" అని చంద్రబాబు తెలిపారు.