మహేష్‌బాబు"శ్రీమంతుడి" స్టైల్‌లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సైకిల్ తొక్కారు. సచివాలయంలో బ్లాక్ నుంచి తన కార్యాలయం వరకు సైకిల్ తొక్కుతూ సరదా తీర్చుకున్నారు.

Last Updated : Jan 31, 2018, 03:00 PM IST
మహేష్‌బాబు"శ్రీమంతుడి" స్టైల్‌లో చంద్రబాబు

మహేష్ బాబు నటించిన "శ్రీమంతుడు" సినిమా చూశారా..ఈ చిత్రంలో హీరో సైకిల్ పై తన తండ్రి పుట్టి పెరిగిన సొంత ఊరికి వెళ్లడమే కాకుండా.. అదే గ్రామాన్ని దత్తత కూడా తీసుకుంటాడు. బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పని చూస్తూ.. అచ్చం అలాగే అనిపించక మానదు. పర్యావరణ పరిరక్షణే తమ అభిమతం అని చాటుతూ, చంద్రబాబు స్మార్ట్ సైకిల్స్ ప్రాజెక్టుకి శ్రీకారం పలికారు. 

ఈ క్రమంలో ఆయన బుధవారం సైకిల్ తొక్కారు. సచివాలయం బ్లాక్ నుంచి తన కార్యాలయం వరకు సైకిల్ తొక్కుతూ సరదా తీర్చుకున్నారు. ఈ సైకిల్ తొక్కుతుంటే చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నట్లు అనిపించిందని చెప్పారు.

వివరాల్లోకి వెళితే.. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా స్మార్ట్ సైకిల్‌‌లను ప్రోత్సహిస్తూ.. తొలిసారి ఆ సైకిళ్ళ వాడకాన్ని అమరావతిలో ప్రవేశపెట్టారు. జర్మనీ నుంచి ఇప్పటికే 30 సైకిళ్ళను దిగుమతి చేసుకుంది ఏపీ ప్రభుత్వం. వెలగపూడిలోని సచివాలయంలో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సీఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం..సైకిల్ సవారీకీ ప్రత్యేకంగా ట్రాక్‌లను ఏర్పాటుచేశారు. సచివాలయం లోపల కూడా రెండు స్మార్ట్ సైకిళ్ళను ఏర్పాటుచేశారు. వాహనాల పార్కింగ్ వద్ద మరో సైకిల్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రతి స్టేషన్‌లో 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. సెక్రటేరియట్ మొత్తం మీద మూడు సైకిల్ స్టేషన్‌లు ఏర్పాటుచేశారు. 

సైకిల్ తీసుకునే వారికి ప్రత్యేకంగా పాస్వర్డ్, స్వైపింగ్ కార్డును ఇస్తారు. పాస్వర్డ్‌తోనే సైకిళ్లు తెరుచుకుంటాయి. పని పూర్తయిన తర్వాత స్టేషన్లలో సైకిళ్లను అప్పజెప్పవచ్చు. అల్యూమినియం, ఎల్లాయిడ్‌తో తయారు చేయబడిన ఈ సైకిళ్లు వర్షంలో తడిసినా తుప్పుపట్టవు. ఈ సైకిళ్లకు మూడుగేర్లు ఉంటాయి. 

 

Trending News