Chandrababu Case: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో నిరాశకు లోనయ్యారు. జైలు తప్పించుకునేందుకు చివరి నిమిషం వరకూ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో శనివారం ఉదయం నంద్యాలలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు విచారణ అనంతరం నిన్న అంటే ఆదివారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు తరపున వాదించేందుకు సుప్రీంకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా అండ్ టీమ్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకుంది. సీఐడీ తరపున ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు విన్పించారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా దాదాపు 8 గంటల సేపు వాదనలు కొనసాగాయి. ప్రధానంగా సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదనే అంశంపైనే డిఫెన్స్ వాదించింది. మద్యాహ్నం 3 గంటలకు తీర్పు రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు..సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తీర్పు వెల్లడించింది. సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తిస్తుందని తెలిపింది. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఆ తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు చంద్రబాబు రెండు పిటీషన్లు దాఖలు చేశారు. రిమాండ్‌ను హౌస్ అరెస్ట్‌గా పరిగణించేలా ఆదేశాలివ్వాలని, ప్రత్యేక జైల్లో ఉంచాలని పిటీషన్లు వేశారు. ఇంటి నుంచి భోజనం, మందులు తెప్పించుకునేందుకు సీఐడీ న్యాయవాదులు ఏ విధమైన అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ హౌస్ అరెస్ట్ , ప్రత్యేక జైలు విషయంంలో తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. ఒకసారి రిమాండ్ విధించాక ఉత్తర్వులు మార్చడానికి వీల్లేదని, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే హౌస్ అరెస్టు ఉంటుందన్నారు. అయితే రాష్ట్రంలో అలాంటి అసాధారణ పరిస్థితుల్లేవని స్పష్టం చేశారు సీఐడీ అధికారులు. ఈ పిటీషన్లపై విచారణ వాయిదా పడింది.
ఈలోగా కోర్టు వారెంట్ సిద్ధం కావడంతో చంద్రబాబును జైలుకు తరలించేందుకు సిద్ధమైన పోలీసులకు టీడీపీ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. వారెంట్ సిద్ధం కావడంతో తప్పదని చెప్పి పోలీసులు చంద్రబాబుని నిన్న అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
దాదాపు ఐదు గంటలకు పైగా సాగిన ప్రయాణంలో ఉద్రిక్తత ఏర్పడింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబుని తరలించారు. భద్రతా కారణాలు దృష్ట్యా సెంట్రల్ జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గది, ఇంటి నుంచి మందులు, ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది.
ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారం రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గది కేటాయించారు. ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. చంద్రబాబు వెంట ఆయన కుమారుడు లోకేష్ కూడా సెంట్రల్ జైలు వరకూ తోడొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.
Chandrababu Case: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు,స్నేహ బ్లాక్ ఖైదీ నెంబర్ 7691