కడప: ధర్మాపోరాట దీక్ష వేదికగా ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత జగన్‌ల పై ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. కడపలో ఈ రోజు టీడీపీ ధర్మ పోరాట సభ నిర్వహించింది. ఈ సందర్భంలో చంద్రబాబు ఉద్వేగపూర్వంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో పాటు ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీతో జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. వీరిద్దరు కలిసి రాష్ట్ర ప్రయోనాలను దెబ్బతీయాలనే కుట్రపన్నారని ఆరోపించారు. జగన్ ట్రాప్ లో ప్రధాని మోడీ పడ్డారని.. అదే సమయంలో మోడీ డైరెక్టన్ లో జగన్ నడుచుకుంటున్నారని చంద్రబాబు దయ్యబట్టారు.
వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మరిచిన మోడీ
నష్టపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకే గత ఎన్నికల్లో బీజేపీ పొత్తుపెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు.పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని ప్రత్యేక హోదా ఇస్తామన్నారు..బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటకు విలువలేకుండా పోయింది. మరోవైపు రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక హోదాను విస్మరించారు. ఏపీని ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హ్యాండ్ ఇచ్చారు. ఆనాడు నరేంద్ర మోడీ చెప్పింది ఏమిటీ ఇప్పుడు చేసేది ఏమిటీ ? అని చంద్రబాబు ప్రశ్నించారు. మనం కొత్తగా ఏమీ అడగడం లేదు..విభజన చట్టంలోని అంశాలపై మాత్రమే డిమాండ్ చేస్తున్నారు...ఈ క్రమంలో ఏపీ హక్కుల కోసం పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు పోరాడారు.. తెలుగు ప్రజల విషయంలో కేంద్రం చేసిన నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై తాము ధర్మా పోరాటం చేస్తున్నామన్నారు.