న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఏపీకి కేంద్రీయ విశ్వవిద్యాలయన్ని కేంద్రం మంజూరు చేసింది. ఈమేరకు బుధవారం కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్ర విభజన హామీ మేరకు అనంతపురం జిల్లా జంతలూరు దగ్గర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనివర్సిటీకి 'ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ' అని పేరుపెట్టారు. ప్రస్తుతానికి తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్ ప్రకటించింది.
సుమారు రూ. 902 కోట్ల వ్యయంతో సెంట్రల్ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. ఈ వర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్ నిర్మించే వరకు ఏపీ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించనున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
రక్షణ దళాల నెట్వర్క్ స్పెక్ట్రం కోసం 11,330 కోట్లకు ఆమోద ముద్ర వేసినట్లు చెప్పారు. ఢిల్లీ మెట్రో సర్వీసులను నోయిడా సిటీ సెంట్రల్ నుంచి నోయిడా సెక్టార్ 62వరకు పొడిగించినట్లు రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. జార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.