చంద్రబాబు ఒక సిద్ధాంతం లేని వ్యక్తి అని.. ఆయనతో కాంగ్రెస్ కలవడం తనకు సుతరామూ ఇష్టం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తెలిపారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న కారణంతో తాను ఆ పార్టీని వీడుతున్నానని రామచంద్రయ్య తెలిపారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని.. అలాంటి వ్యక్తిని సమర్థించాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఏముందో తనకు తెలియదని రామచంద్రయ్య అన్నారు. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారని.. అలాంటి చంద్రబాబును సమర్థించాల్సిన గత్యంతరం కాంగ్రెస్‌కి లేదని రామచంద్రయ్య అన్నారు.
అయినా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి.. అందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. ఢిల్లీకి వచ్చి శాలువా కప్పి.. లడ్డూ తినిపించినంత మాత్రాన చంద్రబాబుకి రాహుల్ వత్తాసు పలకాల్సిన అవసరం లేదని.. ఆయనను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలని రామచంద్రయ్య తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అవినీతిమయం అవ్వడానికి కారణం చంద్రబాబు అని రామచంద్రయ్య తెలిపారు. జన్మభూమి కమిటీల పేరుతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడం ఏపీ ముఖ్యమంత్రికే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న పాపాల్లో పాలు పంచుకోవాల్సి రావడం కాంగ్రెస్‌కి ఉన్నా.. తనకు లేదని రామచంద్రయ్య అన్నారు. ఈ రోజుల్లో అవకాశవాద రాజకీయాలు పెరిగిపోతున్నాయని.. సిద్ధాంతాలు మరిచి రాజకీయం చేయడం నాయకులు నేర్చుకుంటున్నారని.. చంద్రబాబు కూడా అలాంటి నాయకుడే అని రామచంద్రయ్య విమర్శించారు.