హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి బిఎన్ యుగంధర్(81) నేడు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. బిఎన్ యుగంధర్ పూర్తి పేరు బుక్కాపురం నాదెళ్ల యుగంధర్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈయన కుమారుడే. బిఎన్ యుగంధర్ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. 1962 బ్యాచ్‌కి చెందిన యుగంధర్.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వంలోనూ పలు కీలక హోదాల్లో పనిచేశారు. పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధాని కార్యాలయం, గ్రామీణాభివృద్ధి శాఖ విభాగంలో సేవలు అందించారు. యూపిఏ-1 ప్రభుత్వం హయాంలో 2004-2009 వరకు ప్రణాళిక సంఘం సభ్యునిగానూ సేవలందించారు. 1988 నుంచి1993 వరకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమికి డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.
బిఎన్ యుగంధర్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. యుగంధర్ క్లీన్ రికార్డ్ కలిగిన ఐఏఎస్ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారని ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు బిఎన్ యుగంధర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.