అమరావతి: మహారాష్ట్రలో బీజేపి సర్కార్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏపీలోని బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి, ఒకరికొకరు స్వీట్స్ పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి, జాతీయ మహిళ మోర్చా ఇంఛార్జ్ పురంధరేశ్వరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో ఫడ్నవిస్ సుపరిపాలన అందిస్తారనే నమ్మకంతోనే బీజేపీకి ప్రజలు మెజార్టీ సీట్లు కట్టబెట్టారు. కానీ శివసేన బీజేపీకి నమ్మకం ద్రోహం చేసిందని అన్నారు. ఏదేమైనా.. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రజల నమ్మకాన్ని నిలబెడతారని ధీమా వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. శివసేన అధికార దాహంతో నమ్మక ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. మహారాష్ట్రలో బీజేపి అద్భుతమైన పాలనను అందిస్తుందని అన్నారు.
Read also : మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్.. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం!
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. శివసేన పార్టీ తన స్వరూపనికి భిన్నంగా వ్యవహరించిందని అన్నారు. శివసేన అధికార దాహంతో కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపింది. శివసేనతో పొత్తుల కారణంగా మహారాష్ట్రలో బీజేపీకి సీట్లు కూడా తగ్గాయని అభిప్రాయపడ్డారు. ప్రజలు కూడా మహారాష్ట్రలో బీజేపీనే కోరుకుంటున్నారని సోము వీర్రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా సంఘటనా ప్రధాన కార్యదర్శి సతీష్, ఆంధ్రప్రదేశ్ సంఘటనా కార్యదర్శి మధుకర్, తురగా నాగభూషణం, కంభంపాటి హరిబాబు, పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్, రావెల కిషోర్ బాబు, పైడికొండల మాణిక్యాలరావు, తదితరులు పాల్గొన్నారు.