కాపు రిజర్వేషన్లపై మాట తప్పిందెవరు?

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jul 30, 2018, 06:14 PM IST
కాపు రిజర్వేషన్లపై మాట తప్పిందెవరు?

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్లపై మాట తప్పిన వారెవరైనా ఉన్నారంటే... ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని కన్నా స్పష్టం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని వాగ్దానం చేసిన పెద్ద మనిషి.. మాట తప్పి తన హుందాతనాన్ని కోల్పోయారని కన్నా అన్నారు. అలాగే కాపులపై దాడులు చేయడానికి చంద్రబాబు బీసీ నాయకులను రెచ్చగొడుతున్నారని కూడా కన్నా అన్నారు.

గతంలో ముద్రగడ కాపు ఉద్యమం చేస్తే వ్యతిరేకించిన బాబు.. నాలుగేళ్లుగా మీనమేషాలు లెక్కబెడుతున్నారని కన్నా అభిప్రాయపడ్డారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు అనేక రకాలుగా వేధించారని.. తుని ఘటన తర్వాత అనేకమంది కాపులపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టిందని కూడా కన్నా తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేసే ప్రణాళిక బీజేపీ వద్ద సిద్ధంగా ఉందని కూడా కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. 

కాపుల రిజర్వేషన్ విషయంలో జరిగిన తప్పులను చంద్రబాబు కేంద్రం వైపు నెట్టాలని చూస్తున్నారని.. కానీ ప్రజలు అంత తెలివితక్కువ వారు కాదని కన్నా తెలిపారు. అదే విధంగా కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ లాంటి విషయాల్లో చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పలు మీడియా సంస్థలు తప్పుడు కథనాలు రాశాయని కన్నా దుయ్యబెట్టారు. రైల్వే జోన్ ఇచ్చేది లేదని చెబుతూ కేంద్రం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదని.. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని కన్నా హితవు పలికారు. 

Trending News