ఏపీలో మరో బోటు ప్రమాదం సంభవించింది. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నదిలో లాంచీ బోల్తా పడింది. ఆ సమయంలో తీవ్రమైన ఈదురుగాలులు వీచడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో 40మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. వారిలో 10మంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. మరో 30మంది గల్లంతయ్యారు. మిగతా ప్రయాణికుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
భిన్న కథనాలు..
గోదావరిలో మంగళవారం సాయంత్రం లాంచీ బోల్తా ప్రమాదంలో గల్లంతైన వారి సంఖ్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సంఖ్య 10 నుంచి 40 వరకు ఉంది. లాంచీలో బయలుదేరిన వారి సంఖ్యపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పడవలో 25 మంది మాత్రమే ఉన్నారని, వారిలో కొందరు దిగిపోయారని, మరో 10 మంది వరకు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారని ఇక పడవలో 10 మంది మాత్రమే ఉండిపోయారని పోలీసుల ఎదుట లొంగిపోయిన లాంచీ డ్రైవర్ చెబుతున్నాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మరోలా ఉంది. దేవీపట్నం నుంచి తిరుగు ప్రయాణంలో 50-60మంది వరకు లాంచీలో ఉన్నారని పడవ ప్రమాద సమయంలో 10 మంది వరకు తప్పించుకున్నారని దాదాపు 40 మంది తలుపులు మూసేసిన లాంచీలో ఉండిపోయరాని చెబుతున్నారు. వారు గల్లంతయ్యారని వివరిస్తున్నారు. ఈ సంఘటనలో 34 మంది గల్లంతయ్యారని 16మంది ఒడ్డుకు వచ్చారని జిల్లా యంత్రాంగం మంగళవారం అర్ధరాత్రి తెలిపింది.
ప్రత్యక్ష సాక్షులు.. లాంచీలో ఇంకా 30 మంది వరకు గల్లంతయ్యారని చెబుతున్నట్లు జిల్లా అధికారులు వివరించారు. దీంతో అసలు ప్రమాద బాధితులు ఎంత మంది?, గల్లంతైన వారు ఎంత మంది?, ప్రమదం నుండి బయటపడ్డవారు ఎంత మంది? అనే వివరాలు బుధవారమే స్పష్టంగా వెలుగులోకి రానున్నాయి.