AP PRC Issue: ఉద్యోగుల హెచ్ఆర్‌ఏ పెంచిన ఏపీ ప్రభుత్వం... ఎంత పెరిగిందంటే..

AP govt hikes employees HRA: ఇటీవలి పీఆర్సీలో హెచ్ఆర్ఏ శ్లాబులపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులను చల్లబరిచేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఆర్ఏని పెంచుతూ తాజాగా జీవో విడుదల చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 12:14 AM IST
  • ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపు
  • 8 శాతం నుంచి 16 శాతానికి పెంచిన ప్రభుత్వం
  • విజయవాడ పరిసర ప్రాంతాల్లోని హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు పెంపు
 AP PRC Issue: ఉద్యోగుల హెచ్ఆర్‌ఏ పెంచిన ఏపీ ప్రభుత్వం... ఎంత పెరిగిందంటే..

AP govt hikes employees HRA: ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో హెచ్ఆర్ఏకి సంబంధించి కీలక మార్పులు చేసింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హెచ్ఆర్ఏని 8 శాతం నుంచి 16 శాతానికి పెంచింది. గతంలో హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు వర్తించనుంది. ఈ మేరకు  రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా హెచ్ఆర్ఏ పెంపుతో ఉద్యోగులు దిగొస్తారని భావించినప్పటికీ ఆ సూచనలు కనిపించట్లేదు. హెచ్ఆర్ఏ పెంపును ప్రకటిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవోలో అన్నీ లొసుగులే ఉన్నాయని ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. 30 శాతం ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏని 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించడమేంటని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన హెచ్ఆర్ఏ పెంపు జీవోకు శాస్త్రీయత లేదన్నారు.

16 శాతం హెచ్ఆర్ఏకి విజయవాడ, గుంటూరు, వాటి పరిసర ప్రాంతాల్లో అద్దె ఇళ్లు దొరుకుతాయా అని బొప్పరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్‌లో 30 శాతం హెచ్ఆర్ఏని ప్రతిపాదించారని.. కానీ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కిందని విమర్శించారు. ఉద్యోగులపై  అక్కసుతోనే ప్రభుత్వం ట్రెజరీ సిబ్బందికి మెమోలు జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలంటూ ఎందుకు తొందరపడుతోందని ప్రశ్నించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు.

కాగా, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో (AP PRC Issue) హెచ్ఆర్ఏ శ్లాబులపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో 20 శాతం హెచ్ఆర్ఏ శ్లాబులో ఉన్నవారికి 16 శాతం, 14.5 శాతం హెచ్ఆర్ఏ శ్లాబులో ఉన్నవారికి 8 శాతం, 12 శాతం హెచ్ఆర్ఏ శ్లాబులో ఉన్నవారికి 8 శాతానికి తగ్గించారు. దీంతో ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నప్పటికీ.. డిమాండ్లను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.

Also Read: Weekend OTT Releases: ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా.. వీకెండ్ రిలీజ్ ఫుల్ లిస్ట్ ఇదే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News