AP High Court Crucial Comments Government Advisors: ఏపీలో 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మందిని వివిధ శాఖలకు సలహాదారులుగా నియమిస్తూ రావడం ఆసక్తికరంగా మారింది. వారందరిలో కొంతమంది క్యాబినెట్ హోదాతో కూడా సలహాదారులుగా నియమిస్తున్నట్లు జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ వచ్చింది. అయితే తాజాగా సలహాదారుల నియామకం విషయంలో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇలాగే వదిలేస్తే రేపు ఎమ్మార్వోలకు కూడా సలహాదారులను నియమిస్తారంటూ కామెంట్లు చేసింది హైకోర్టు. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు ఉండగా వివిధ శాఖలకు మళ్ళీ సలహాదారులు ఎందుకని ప్రశ్నించింది హైకోర్టు. సలహాదారుల నియామకానికి సంబంధించిన రాజ్యాంగబద్ధత ఎంతవరకు ఉందో తేలుస్తామని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాక సలహాదారుల పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
దేవాదాయ శాఖకు సంబంధించి సలహాదారుడిగా నియమితులైన శ్రీకాంత్ పై గతంలో విధించిన స్టే ఉత్తర్వులను సవరిస్తూ సలహాదారుగా కొనసాగేందుకు శ్రీకాంత్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇక సలహాదారుల నియామకంపై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనికి సంబంధించి త్వరలోనే విచారణ జరుపుతామని పేర్కొంది. నిజానికి ఏపీ ప్రభుత్వం నియమిస్తున్న సలహాదారుల విషయం మీద ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగుదేశం సహా విపక్షాలన్నీ మండిపడుతున్నాయి.
అర్హతలతో సంబంధం లేకుండా రాజకీయ నిరుద్యోగులకు పునరావసం కల్పిస్తున్నారని ప్రజల డబ్బులను వారికి జీతాలుగా ఇచ్చి పార్టీ పనులు చేయించుకుంటున్నారనే అనేక ఆరోపణలు ఉన్నాయి. శాఖ, విభాగం అనే తేడా లేకుండా ఎక్కడ వీలైతే అక్కడ సలహాదారులను నియమిస్తున్నారని ఆరోపణలు ముందు నుంచి వినిపిస్తున్నాయి.
ఒక్కొక్కరికి లక్ష నుంచి మూడు రక్షల రూపాయలకు పైగా జీతం, ప్రభుత్వ వాహనం సహా అనేక ఇతర అలవెన్సులు కూడా కల్పిస్తున్నారు. అంతేకాక ప్రస్తుతానికి ఉన్న సలహాదారులలో 13 మందికి పైగా సలహాదారులకు క్యాబినెట్ ర్యాంకు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయం మీద హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook