ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేకుండానే ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు పూర్తయ్యాయి. దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 7 గంటలకు విజయవాడ చేరుకోవాల్సి వుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొనాల్సి వున్నప్పటికీ ఆయన అనుకున్న సమయానికి అక్కడకు రాలేకపోయారు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణమైన ఏపీ సీఎం చంద్రబాబు మార్గం మధ్యలో అబు ధాబిలో చిక్కుకుపోయారు. అక్కడి విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు ఏర్పడిన కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చంద్రబాబు ఎక్కాల్సి వున్న విమానం సైతం ఆలస్యమవడంతో ఆయన అనుకున్న సమయానికి విజయవాడకు రాలేకపోయారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆయన విజయవాడ చేరుకునే అవకాశాలున్నాయి.
అనుకున్న సమయానికి సీఎం చంద్రబాబు విజయవాడ చేరుకోకపోవడంతో ముఖ్యమంత్రి నివాసంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రజాప్రతినిధుల మధ్య జండా ఎగరేశారు. అనంతరం ఇందిగా గాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ఆమె పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విజయవాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జండా ఎగరేశారు.