అమరావతి : కేసీఆర్‌తో కలిసి ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్న వైఎస్ జగన్‌కు రాష్ట్రాభివృద్ధిపట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఆయన వ్యాఖ్యలే స్పష్టంచేస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టీఆర్ఎస్తో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ లాలూచీ పడ్డారని చెప్పడానికి వైఎస్ జగన్ వ్యాఖ్యలు నిదర్శనం అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్న టీఆర్ఎస్ పార్టీతో జగన్ ములాఖత్ అయ్యారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సి వున్న నిధులపై జగన్ ఏనాడూ మాట్లాడలేదని, ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయపడేవాడు ఏపీకి ఇంకేం న్యాయం చేస్తాడని ఈ సందర్భంగా జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి రావాల్సిన రూ.32వేల కోట్లు పీఎంవో ఆపితే, ఈ అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లే లేరని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, అవి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఓట్ల కోసమే ప్రధాని మోదీ ఈబీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు, ముస్లిం రిజర్వేషన్లపై ఎప్పటినుంచో పోరాడుతుంటే, ఆ అంశంపై కేంద్రం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌కి రూ.80 వేల కోట్లు ఇవ్వాలని జేపీ కమిటీ సూచిస్తే, పవన్ కల్యాణ్ మాత్రం రూ.75 వేల కోట్లు ఇవ్వాలని అడుగుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.