AP Rajyasabha Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకు కీలక స్థానముంది. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక వహిస్తోంది. పెద్దల సభలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉన్న పార్టీ తొలిసారిగా ఆ ప్రాతినిధ్యాన్ని కోల్పోతోంది.
ఏపీ రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మూడింటిలో లెక్క ప్రకారం రెండు తెలుగుదేశానివే. ఒకటి మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు ఈ మూడింటిని సంఖ్యాబలం ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి కన్పిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. కారణం సంఖ్యా బలం లేకపోవడమే. ఒక్కొక్క రాజ్యసభ సభ్యునికి కావల్సిన బలం 44 మంది ఎమ్మెల్యేలు. తెలుగుదేశంకు అధికారికంగా ఉన్నది 18 మంది మాత్రమే.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో పెద్దఎత్తున అభ్యర్ధుల్ని మార్చుతోంది. దాంతో అసంతృప్త ఎమ్మెల్యేలు తమవైపు వస్తారని వారి సహాయంతో రాజ్యసభ స్థానం ఒక్కటైనా గెల్చుకోవాలని టీడీపీ యోచిస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదు. దాంతో టీడీపీకు కావల్సిన మరో 26 మంది ఎమ్మెల్యేల బలం ప్రశ్నార్ధకమైంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల మద్దతుతో అనూహ్యంగా ఓ ఎమ్మెల్సీని గెల్చుకున్న తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా అదే వ్యూహం అవలంభించాలని చూస్తోంది. కానీ ఎన్నికల వేళ ఇలా చేయడం తప్పుడు సంకేతాలకు దారి తీయవచ్చు. మరోవైపు 26 మంది ఎమ్మెల్యేలను సేకరించాలంటే తలకు మించిన భారమే.
ప్రయత్నించి విఫలమయ్యేకంటే పోటీకు దూరంగా ఉంటే మంచిదనే భావన కూడా కన్పిస్తోంది. అలాగని వదిలేస్తే 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకు తొలిసారిగా పెద్దల సభలో ప్రాతినిధ్యం కరువౌతుంది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు రాజ్యసభలో బలం మరింతగా పెరగనుంది.
Also read: AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, బకాయిల చెల్లింపుకు 5500 కోట్ల విడుదలకు ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook