AP Politics: ఉమ్మడి తూర్పు గోదావరి రాజకీయాల్లో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పేరు ఎవరూ మర్చిపోరు. ముఖ్యంగా జనసైనికులు అస్సలు మర్చిపోరు. 2019లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. తరువాత వైసీపీలో చేరి ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు తిరిగి సొంతగూటికి లేదా టీడీపీలో చేరవచ్చని తెలుస్తోంది. రాజోలు నియోజకవర్గంలో జరిగిన జనసేన సమావేశానికి హాజరుకావడం వెనుక కారణం అదేనంటున్నారు అంతా.
2019 ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెల్చుకుని అధికారం చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటు గెల్చుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. రాజోలు నుంచి మాత్రం జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ స్వల్ప ఓట్ల ఆధిక్యంతో గెలిచి ఒకే ఒక్కడిగా నిలిచారు. కానీ ఎంతోకాలం ఆ పార్టీలో నిలవలేకపోయారు. అధికార పార్టీకు మద్దతుగా చేరిపోయారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నించి పార్టీకు దూరంగానే ఉంటున్నారు. పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. వైసీపీకు గుడ్ బై చెప్పనున్నారనే టాక్ కూడా విన్పించింది. ఈ క్రమంలో రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో జరిగిన జనసేన సమావేశంలో ఆయన ప్రత్యక్షమవడం రాజకీయంగా చర్చనీయాంశమౌతోంది.
అంతేకాదు రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌ను కలిసి కొన్ని అంశాలపై చర్చించినట్టు సమాచారం. త్వరలో వైసీపీకు రాజీనామా చేసి జనసేనలో చేరవచ్చని తెలుస్తోంది. ఒకవేళ జనసేనలో చేరేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి నేతలు జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు రాపాక వరప్రసాద్ కూడా చేరవచ్చని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం పార్టీలు విడివిడిగా ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నందున పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా నేతల్ని చేర్చుకోవచ్చని సమాచారం.
అయితే రాపాక తనను కలవడానికి కారణం రాజకీయపరమైంది కాదని ప్రస్తుత ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అంటున్నారు. మలికిపురం కళాశాలలో పనిచేస్తూ జీతాలు రావడం లేదని ధర్నా చేస్తున్న 25 మంది అద్యాపకుల సమస్య కోసం కలిసినట్టు చెబుతున్నారు. రాపాక జనసేన సమావేశానికి రావడం వెనుక రాజకీయ కారణం లేదని రాజోలు ఎమ్మెల్యే చెబుతున్నా కారణం అదే కావచ్చంటున్నారు.
Also read: Heavy Rains Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.