ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీయేతర పార్టీల నేతలతో సమావేశమై ఏపీకి జరిగిన నష్టాన్ని వారికి అర్థమయ్యేలా వివరించారు. బీజేపీ మినహా ఇతర పార్టీల నేతలను కలిసి లోక్‌సభలో కేంద్రానికి వ్యతిరేకంగా తమ పార్టీ ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసిన అనంతరం బుధవారం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం తాము చేసిన ప్రయత్నాలన్నింటినీ మీడియా ముందు ఏకరువు పెట్టిన చంద్రబాబు... ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తంచేశారు. "కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ కోసం రెండున్నరేళ్లపాటు వేచిచూసినా ప్రయోజనం లేకపోయింది. కేంద్రం వైఖరి పట్ల ఆంధ్రులు తీవ్ర అసహనంతో వున్నారు. కేంద్రం అవలంభిస్తోన్న కఠిన వైఖరి కారణంగా ఐదు కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. కనీస సాయం చేయడానికి బదులు తిరిగి రాష్ట్రంపైనే ఎదురుదాడికి దిగడం ఎంతమేరకు సమంజసం" అని చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎన్నిసార్లు కేంద్రాన్ని సహాయం కోరినా.. కేంద్రం వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అందువల్లే ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సి వచ్చింది అని ఎన్డీఏ నుంచి వైదొలగడానికి దారితీసిన పరిస్థితులని చంద్రబాబు మీడియాకు వివరించారు.
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జాతీయ మీడియాకు వివరించిన సీఎం చంద్రబాబు... పనిలోపనిగా ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ నెల్లూరు, తిరుపతి సభల్లో ప్రసంగిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన వీడియోను ప్రదర్శించారు. అంతేకాకుండా అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని స్పష్టంచేసిన వీడియో క్లిప్పింగులని సైతం మీడియా ఎదుట ప్రదర్శించారు.
రాష్ట్ర విభజన మొదలుకుని, ఎన్నికల సమయంలో ఏపీలో ప్రచారానికి వచ్చిన సందర్భాల్లో, ఆ తర్వాత ప్రధాని హోదాలో రాష్ట్రానికి వచ్చిన సందర్భాల్లో మోదీ ఇచ్చిన హామీలని మీడియాకు చూపించిన చంద్రబాబు.. ఇందులో ఏ హామీలని కూడా కేంద్రం నెరవేర్చలేదని చెప్పేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.