రాజమహేంద్రవరం: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వబోమని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్ అన్నారు. రాష్ట్రాన్ని విడదీయడమేకాకుండా ఆంధ్రాకు రావాల్సిన ప్రత్యేక హోదాను అడ్డుకున్న కేసీఆర్ ఆంధ్రాలో ఎలా అడుగుపెడతారని ప్రశ్నించారు. ఆంధ్రా పురోహితులకు వేదమంత్రాలు రావని, ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుందని, ఆంద్రా వాళ్ల వల్లే తెలంగాణలో ఇన్నేళ్లు అభివృద్ధి కుంటుపడిందని ఎన్నో ఆరోపణలు చేసి ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రాకు వచ్చే ఆలోచన ఎలా చేస్తున్నారని దాస్యం ప్రసాద్ నిలదీశారు. రాజమహేంద్రవరంలోని బీసీ సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఏపీలో పవన్ కల్యాణ్ - కేసీఆర్ ఫ్లెక్సీ కలకలం !
ఆంధ్రా, తెలంగాణ వారి మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి, అన్నదమ్ముల్లా కలిసి ఉన్న వారిని విడదీసిన కేసీఆర్ ఒకానొక దశలో తెలంగాణాలో వున్న ఆంధ్రులను భయభ్రాంతులకు గురి చేసిన తీరును ఆంధ్రావాళ్లు అప్పుడే మరిచిపోతారా అని ప్రశ్నించిన ప్రసాద్.. అవన్నీ మర్చిపోయి కేసీఆర్ ఆంధ్రాకు వస్తానంటే ఆయన్ను కచ్చితంగా ఆంధ్రాలోకి అడుగుపెట్టనిచ్చేది లేదని అన్నారు. ఆత్మాభిమానం కలిగిని ఆంధ్రులు ఎవరైనా కేసీఆర్ రాకను ప్రతిఘటిస్తారని ప్రసాద్ అభిప్రాయపడ్డారు.