మూడు రాజధానులు వద్దు .. అమరావతే ముద్దు అంటూ .. దాదాపు నెల రోజులకు పైగా పోరాడుతున్న అమరావతి రైతుల పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది. రోడ్లపై వంటావార్పులు.. మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలు .. అసెంబ్లీ ఎదుట నిరసనలు .. ఇలా అన్నదాతలు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతిని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుకు సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి .. ఎక్కడా వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. దీంతో మూడు రాజధానుల ప్రతిపాదన త్వరలోనే నిజం కానుందనే ప్రచారం కూడా కొనసాగుతోంది.
మరోవైపు రైతులు మాత్రం తమ పోరాటాన్ని వీడడం లేదు. అమరావతి కోసం తమ ప్రాణాలైనా అర్పిస్తామంటూ అన్నదాతలు రోడ్లపైనే ఉంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. తాజాగా అన్నదాతలు తమ నిరసనను వినూత్న పద్ధతిలో తెలియజేశారు. రాయపూడిలోని రైతులు కృష్ణా నదిలో నడుము లోతు వరకు మునిగి జలదీక్ష చేపట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న రైతులు .. ఇందుకోసం తాము ఎలాంటి నిరసనకు ఐనా సిద్ధమని ప్రకటించారు. మరోవైపు ఈ జలదీక్షలో మహిళా రైతులు కూడా పాల్గొనడం విశేషం. వారంతా నల్ల జెండాలతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
#WATCH Amaravati: Protests continue against Andhra Pradesh Govt's decision of decentralization(three capitals). People in Rayapudi protested in Krishna river against the Govt decision pic.twitter.com/9cx3sBuv67
— ANI (@ANI) January 28, 2020
మూడు రాజధానులు వద్దు- అమరావతే ముద్దు