నేటి నుంచి ఏపీలో నవ నిర్మాణ దీక్షలు

ఆంధ్రప్రదేశ్‌‌లో నేటి నుంచి (జూన్2వ తేదీ) నవ నిర్మాణ దీక్షలు ప్రారంభం కానున్నాయి.

Last Updated : Jun 2, 2018, 09:23 AM IST
నేటి నుంచి ఏపీలో నవ నిర్మాణ దీక్షలు

ఆంధ్రప్రదేశ్‌‌లో నేటి నుంచి (జూన్2వ తేదీ) నవ నిర్మాణ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద 'నవ నిర్మాణ దీక్ష' నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రజలు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయిస్తారు.

''విభజన సమయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఆ తర్వాత నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. రెండంకెల వృద్ధి రేటు సాధించినా తలసరి ఆదాయంలో మాత్రం ఇంకా మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఇంకా చాలా అభివృద్ధి సాధించాల్సి ఉంది. కాబట్టి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు చేసుకోవడం సమంజసం కాదు. అందుకే ఈ ఏడాది కూడా నవ నిర్మాణ దీక్ష నిర్వహిస్తున్నాం'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విభజన హామీలకు సంబంధించి కేంద్రం ఏ మాత్రం సహకరించక పోయినా.. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కష్టపడి మంచి ఫలితాలు సాధించారని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజలకు అంకితం చేస్తున్నామని ఆయన తెలిపారు.

నవ నిర్మాణ దీక్ష మహాసంకల్ప కార్యక్రమంలో భాగంగా వారం రోజులపాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల వివరాలను అధికారులు విడుదల చేశారు.

జూన్‌ 2న : తొలి రోజు నవ నిర్మాణ దీక్ష – ప్రతిజ్ఞ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం – విభజన హామీలు, అమలుపై చర్చ (విభజన చట్టం-అమలు తీరు)
జూన్‌ 3న : నీటి భద్రత-కరవు రహితరాష్ట్రం (తాగునీరు-సాగునీరు-పారిశ్రామికనీరు-పోలవరం-ప్రాధాన్య ప్రాజెక్టులు-జలవనరులు)
జూన్‌ 4న : రైతు సంక్షేమం-ఆహార భద్రత (వ్యవసాయ, అనుబంధ రంగాలు-పౌరసరఫరాలు)
జూన్ 5న : సంక్షేమం-సాధికారత (వైద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, సమాజ వికాసం, కుటుంబ వికాసం)
జూన్ 6న : ఉపాధి కల్పన-జ్ఞానభూమి (పారిశ్రామికం, సేవారంగం, మానవ వనరులు, విద్య, నైపుణ్యాభివృద్ధి)
జూన్ 7న : మౌలిక సదుపాయాలు-మెరుగైన జీవనం (అమరావతి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి)
జూన్ 8న : సుపరిపాలన - అవినీతి రహిత సమాజము, మహా సంకల్పం (సుపరిపాలన-అవినీతి రహితపాలన, గ్రామ, రాష్ట్ర స్థాయిలో యాక్షన్‌ ప్లాన్‌, ఈ-ప్రగతి, ఐటీ, ఐవోటీ, పౌరసేవలు, సుస్థిర వృద్ధి, విజన్‌) నిర్వహిస్తారు.

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు.. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో.. ఓడీఎఫ్‌, ఓడీఎఫ్‌ ప్లస్‌, సిమెంట్‌రోడ్లు, పంట కుంటలు, ఫైబర్‌ గ్రిడ్స్‌, వర్చువల్‌ క్లాస్‌రూములు, అర్బన్‌, రూరల్‌ హౌసింగ్‌, అంగన్‌వాడీ భవనాలను ఉద్దేశించి నవ నిర్మాణ దీక్ష వారం రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలిరోజు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలతో మహా సంకల్ప ప్రతిజ్ఞ చేయిస్తారు. అనంతరం ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో గ్రామసభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.

 

Trending News