నేతాజీ మాటకు ఆశ్చర్యపోయిన హిట్లర్

నేతాజీగా భారతీయుల ఆదరణను, అభిమానాన్ని పొందిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అన్న సంగతి మనకు తెలిసిందే.

Last Updated : Sep 21, 2018, 07:57 PM IST
నేతాజీ మాటకు ఆశ్చర్యపోయిన హిట్లర్

నేతాజీగా భారతీయుల ఆదరణను, అభిమానాన్ని పొందిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అన్న సంగతి మనకు తెలిసిందే. స్వాతంత్ర్యపోరాట సమయంలోనే ఆయన అనేకమంది ప్రపంచ దేశాధినేతల మద్దతు కూడగట్టేందుకు వివిధ రాజ్యాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జర్మనీ వెళ్లారు. అక్కడ నేతాజీకి ఒక చిత్రమైన అనుభవం ఎదురైంది. హిట్లర్‌ని చూడడానికి వెళ్లిన బోసును సెక్యూరిటీ అధికారులు ఓ పెద్ద భవనంలోకి తీసుకొని వెళ్లారు. కొంచెం సేపు ఆగమని.. హిట్లర్ వచ్చి కలుస్తారని చెప్పి వారు వెళ్లిపోయారు. 

దాంతో.. నేతాజీ అక్కడే ఓ కుర్చీలో ఆసీనులై ఓ పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయి ఉన్నారు. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన హిట్లర్ నేతాజీ పక్క నుండే నడుచుకొని వెళ్లారు. కానీ ఆయనవైపు బోస్ కనీసం చూడనైనా చూడలేదు. తన పనిలో తాను నిమగ్నులై ఉన్నారు. హిట్లర్ చాలా సార్లు అలాగే వచ్చి వెళ్లారు. అయినా నేతాజీ తనవైపు చూడనైనా చూడలేదు. ఆఖరికి హిట్లరే దగ్గరకు వచ్చి "మిస్టర్ బోస్.. ఏ పని మీద వచ్చారు" అని పలకరించారు. అప్పుడు బోస్ మాట్లాడుతూ "నేను హిట్లర్‌ని కలవడానికి వచ్చాను. ఆయనకు నేను వచ్చిన విషయాన్ని తెలపండి" అన్నారు. ఆ వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపోయి వెంటనే వెళ్లిపోయాడు. అంటే అప్పుడు బోస్‌తో మాట్లాడింది నకిలీ హిట్లర్ అన్నమాట.

తర్వాత అసలైన హిట్లర్ వచ్చి నేరుగా నేతాజీ భుజం పై చేయి వేశాడు. అప్పుడు మాత్రమే నేతాజీ లేచి హిట్లర్‌తో కరచాలనం చేశారు. అప్పుడు హిట్లర్ మాట్లాడుతూ "మిస్టర్ బోస్..ఇంతకు క్రితం వచ్చింది హిట్లర్ కాదని ఎలా తెలుసుకోగలిగారు" అన్నారు. అప్పుడు నేతాజీ ఈ విధంగా బదులిస్తారు. "నా భుజం పై చేయి వేసే ధైర్యం ఒక హిట్లర్‌కి తప్ప ఇంకెవరికీ లేదు" అనడంతో హిట్లర్ ఈసారి నిజంగానే ఆశ్చర్యపోయాడు. 'నిజమే... మీపై చేయి వేయాలంటే అందుకు ఎంతో ధైర్యం ఉండాలి'' అంటూ నేతాజీని స్వయంగా హిట్లరే లోపలికి తీసుకొని వెళ్తారు. తాను భద్రతా కారణాల వలన నకిలీ వ్యక్తులను నియమించుకుంటూ ఉంటానని.. కానీ బోస్ తనను గుర్తుపట్టడం ఆశ్చర్యంగా ఉందని నేతాజీకి చెబుతారు హిట్లర్.

Trending News