మరణశిక్షను రద్దు చేయడానికి ఇప్పుడు మరో దేశం కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఉరిశిక్షకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమాలు చెలరేగుతుండడంతో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. ఎట్టకేలకు మరణశిక్షను రద్దు చేయాలని సంకల్పించినట్లు మలేషియా సమాచార శాఖ మంత్రి గోబింద్ సింగ్ డియో తెలిపారు. ఈ అంశానికి సంబంధించి త్వరలోనే ఒక చట్టాన్ని కూడా చేయనున్నట్లు తెలిపారు. ఈ వార్త మీడియాలో ప్రసారం కాగానే మరణశిక్ష వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు ఆ దేశ నలుమూలలా సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మరణశిక్షను ఒక అమానవీయమైన, క్రూరమైన శిక్షగా పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఒకవేళ మలేషియాలో ఇదే విషయమై ఒక చట్టం అనేది ఏర్పడితే.. విదేశాల్లో కూడా ఆ దేశం వారికి ఇదే శిక్ష పడుతున్నప్పుడు అడ్డుకొనే అధికారం కూడా వస్తుందని పలువురు స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు తెలియజేశారు. అనేక సంవత్సరాలుగా మలేషియాలో మరణశిక్ష అనేది అమలులో ఉంది.
మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారితో పాటు అక్రమ ఆయుధాలు కలిగున్నా.. హత్యా నేరాలు చేసినా సరే మలేషియాలో మరణశిక్షలు విధించే సంప్రదాయం ఉంది. ఆర్జెంటీనా, ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, జర్మనీ, ఐర్లాండ్, నార్వే, సెర్బియా, నేపాల్‌తో పాటు ఇంకా అనేక దేశాలు ఇప్పటికే మరణశిక్షను రద్దు చేశాయి.