శనివారం పాకిస్తాన్లోని ఆర్మీ స్థావరం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది సైనికులు చనిపోగా..13 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. బాంబు దాడిలో మరణించినవారిలో ఒక అధికారి కూడా ఉన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడింది తామే అని పాకిస్తానీ తాలిబాన్ పేర్కొంది.
'స్వాత్ లోయలోని కాబల్ ప్రాంతంలో సైన్యం యూనిట్ యొక్క స్పోర్ట్స్ ప్రాంతంపై దుండగులు దాడికి తెగబడ్డారు' అని సైనికుల మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆఫ్గనిస్తాన్తో వాయువ్య సరిహద్దు వెంట వరుస సైనిక చర్యలు జరిపిన తరువాత పాకిస్తాన్లో హింసాకాండ క్షీణించింది. మళ్లీ ఇటీవలి కాలంలో ముష్కరులు దాడులకు తెగబడ్డారు. 2007-2009లో స్వాత్ లోయ ప్రాంతం పాకిస్తానీ తాలిబాన్ చేతిలో ఉండేది. వారు కఠినమైన ఇస్లామిక్ చట్టాలను విధించేవారు. ప్రజలను చిత్రహింసలు పెట్టేవారు. సైనిక చర్యలు చేపట్టాక అవన్నీ తగ్గుముఖం పట్టాయి.