మూడేళ్ల క్రితం నాటి మాంసాన్ని వడ్డించిన రెస్టారెంట్.. ఇద్దరు చిన్నారులు మృతి!

Last Updated : Nov 14, 2018, 02:31 PM IST
మూడేళ్ల క్రితం నాటి మాంసాన్ని వడ్డించిన రెస్టారెంట్.. ఇద్దరు చిన్నారులు మృతి!

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంత రాజధాని కరాచిలో దారుణం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌కి చెందిన మీడియా సంస్థ డాన్ న్యూస్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి అరిజోనా గ్రిల్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఓ కుటుంబంలోని ముగ్గురు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలయ్యారు. అందులో ఒక వృద్ధురాలు ఉండగా మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. భోజనం చేసి ఇంటికి చేరుకున్న అనంతరం ఇద్దరు చిన్నారులు, వృద్ధురాలికి వాంతులు, విపరీతంగా కడుపునొప్పి రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మైనర్ బాలురు ఇద్దరు మృతిచెందగా వృద్ధురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చిన్నారుల మృతి అనంతరం వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరిజోనా గ్రిల్ రెస్టారెంట్‌ని మూసేసిన పోలీసులు రెస్టారెంట్‌తోపాటు రెస్టారెంట్‌కి చెందిన గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మూడేళ్ల క్రితంనాటి మాంసాన్ని రెస్టారెంట్ నిర్వాహకులు నిల్వచేసినట్టు గుర్తించారు. 80 కిలోల కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

డాన్ న్యూస్ పేర్కొన్న కథనం ప్రకారం అరోజినా గ్రిల్ రెస్టారెంట్ నిర్వాహకులు రెస్టారెంట్‌లో వడ్డిస్తున్న ఆహరం నాణ్యతను పెంచాల్సిందిగా ఇటీవలే అక్కడి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెట్టిన రెస్టారెంట్ నిర్వాహకులు యధావిధిగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే ఈ దారుణం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్టారెంట్‌లో భోజనం చేసిన అనంతరం ఇంటికి వెళ్లే దారిలో చిన్నారులు చాక్లెట్స్ కూడా తినడంతో.. వారి మృతికి అసలు కారణం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారుల వాంతుల నుంచి సేకరించిన నమూనాలు, వారి రక్తపు నమూనాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపించిన పోలీసులు.. తమ దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచిచూస్తున్నారు. 

ఇదిలావుంటే, చిన్నారుల మృతిపై తీవ్ర సంతాపం ప్రకటించిన అరిజోనా గ్రిల్ రెస్టారెంట్ నిర్వాహకులు.. తాము వడ్డించిన ఆహారంలో మాత్రం ఎలాంటి కల్తీ లేదని వివరణ ఇచ్చారు.

Trending News