ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వెబ్సైట్లను మూసివేస్తున్నాయి. తాజాగా చైనా.. హానికరంగా మారిన నాలుగు వేల వెబ్సైట్లు, ఆన్లైన్ అకౌంట్లను మూసివేసినట్లు ఆ దేశ వార్తా సంస్థ జిన్హువా శనివారం వెల్లడించింది. చాలా వెబ్సైట్లు వినియోగదారులను తప్పుదోవ పట్టించడం, వారి సమాచారాన్ని అక్రమంగా చోరీ చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నందున గత మూడు నెలల్లో నాలుగు వేల వెబ్సైట్లు, ఆన్లైన్ అకౌంట్లను చైనా మూసివేసినట్లు తెలుస్తోంది.
చైనా ఇంటర్నెట్పై కఠిన చర్యలను తీసుకొని అమలు చేస్తోంది. అశ్లీలత, జూదం, మతపరమైన ప్రచారం, పుకార్లు వంటి చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కార్యకలాపాలపై ఏమాత్రం ఉపేక్షించడం లేదు. గత మే నెలలో 120 ఉల్లంఘనలను గుర్తించి.. వారిని సరిచేయాల్సిందిగా 230 కంపెనీలకు నోటీసులు పంపించారు అధికారులు. ఆగస్టు చివరి నాటికి 1,43,000పేజీలను తొలగించినట్లు చైనా అధికారులు తెలిపారు. గతకొంతకాలంగా ఇంటర్నెట్పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా.. హానికరంగా ఉండే ఆన్లైన్ కంటెంట్లపై అధికారులు గురిపెట్టారని జిన్హువా తెలిపింది. గతవారం కాంబోడియా నడుపుతున్న ఓ పోర్నోగ్రఫీ సైటును అధికారులు గుర్తించి మూసేయించారు.
నేపాల్లో అశ్లీల వెబ్సైట్లపై నిషేధం!
ఇటీవల నేపాల్లో అత్యాచారాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అశ్లీల వెబ్సైట్లను నిషేధించాలని నిర్ణయించింది. అశ్లీల వెబ్సైట్లు, కంటెంట్లకు యువత ప్రేరేపితమై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా అసభ్యకరమైన దృశ్యాలను ప్రసారం చేయకూడదని సూచించింది. నిబంధనలు పాటించని వెబ్సైట్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది.