అమెరికా అధ్యక్షుని సెక్యూరిటీ జోన్‌లో ఏముంది..?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పర్యటన కోసం భారత్ రానున్నారు. ఫిబ్రవరి 24న ఆయన తొలిసారిగా భారత దేశానికి వస్తున్నారు. ఆయనతోపాటు భార్య మెలానియా ట్రంప్ కూడా రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.

Last Updated : Feb 18, 2020, 02:04 PM IST
అమెరికా అధ్యక్షుని సెక్యూరిటీ జోన్‌లో ఏముంది..?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పర్యటన కోసం భారత్ రానున్నారు. ఫిబ్రవరి 24న ఆయన తొలిసారిగా భారత దేశానికి వస్తున్నారు. ఆయనతోపాటు భార్య మెలానియా ట్రంప్ కూడా రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. 

అందుకోసం 22  కిలోమీటర్ల మేర రోడ్డుపై ర్యాలీగా వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు 22 కిలోమీటర్లపాటు రోడ్ షోగా వెళ్లడం అంటే మాటలు కాదు. ఆయనకు చాలా సెక్యూరిటీ అవసరం . ఈ నేపథ్యంలో ఆయన కంటే ముందుగానే భద్రతా అధికారులు గుజరాత్ చేరుకున్నారు. 
ఇంతకీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ కోసం ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తారు..? ఆయన సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉంటుంది...?  తెలుసుకోవాలని ఉందా..? ఐతే ఈ స్టోరీ చదవండి. .

అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు కావడంతో డోనాల్డ్ ట్రంప్‌కు ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇందుకోసం అమెరికా ఆర్మీ బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాయి. ఏ దేశానికి వెళ్లినా.. సొంత సెక్యూరిటీ ప్రొటోకాల్ తీసుకుంటాయి. అలాగే భారత్‌లోనూ అమెరికా ఆర్మీ .. సొంత సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకోసం అమెరికా భద్రతా బలగాలు..  గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అడుగు పెట్టాయి. ఆ విమానంలో ట్రంప్ కాన్వాయ్, మిగతా భద్రతా పటాలం దిగింది.

ఇందులో ముందుగా అమెరికా అధ్యక్షుని విమానం గురించి చెప్పుకోవాలి. ఈ  విమానానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. భద్రతాపరంగానూ అత్యాధునిక సాంకేతిక అంశాలు ఇందులో ఏర్పాటు చేశారు. ముందుగా దీని గురించి తెలుసుకుందాం. ఆయన ప్రయాణించేందుకు బోయింగ్ 747-200B ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగిస్తారు. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే..  గాలిలో వెళ్లే వైట్ హౌజ్ లాంటిదని చెప్పవచ్చు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విమానం గాలిలోనే ఇంధనాన్ని నింపుకోగలదు. VC-25A డిజిగ్నేషన్ గా ఉన్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ పై United States of America అని రాసి ఉండడంతోపాటు అమెరికా జెండా ఉంటుంది. దీనిలో అత్యాధునిక సాంకేతిక ఫీచర్స్ ఉన్నాయి.  ఎలాంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలనైనా ఇది నిరోధించగలదు. సమాచారాన్ని ఇవ్వడానికి, తీసుకోవడానికి అత్యాధునిక పరికరాలు ఇందులో ఏర్పాటు చేశారు. ఫలితంగా అమెరికాపై దాడికి సంబంధించి చీమ చిటుక్కుమన్నా .. మొబైల్ కమాండ్ సెంటర్‌గా ఇది ఆదేశాలు ఇచ్చేందుకు రెడీగా ఉంటుంది.  అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం మొత్తంగా 4 వేల చదరపు అడుగులు. దీన్ని మూడంతస్తుల్లో నిర్మించారు. అమెరికా అధ్యక్షుడు దీన్ని పూర్తి వైట్ హౌజ్ కార్యాలయంగా వాడుకునే సదుపాయం ఉంది. ఆయన కోసం ప్రత్యేకంగా ఓ మెడికల్ స్యూట్ ఏర్పాటు  చేశారు. అందులో ఓ ఆపరేషన్ థియేటర్ కూడా ఉంటుంది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు కాన్వాయ్ కూడా అంతే భద్రతా ప్రమాణాలతో కూడి ఉంటుంది. యూఎస్ ప్రెసిడెంట్ ఉపయోగించే కాన్వాయ్‌ని లైమోజిన్ గా వ్యవహరిస్తారు. ఇందులో రెండు కార్లు ఉంటాయి. వాటిని  'ద బీస్ట్'గా వ్యవహరిస్తారు. ఈ  కారును స్టీల్, అల్యూమినియం, సిరామిక్ తో తయారు చేస్తారు. కారు మందం దాదాపు 8 అంగుళాలు ఉంటుంది. ఒక్కో కారు ధర 1.5 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అంతే కాదు ఒక్కో కారు దాదాపు 10 వేల కిలోల బరువు ఉండడం విశేషం. ఈ బీస్ట్ కార్లను బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు .. అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌గా ఉపయోగించడం ప్రారంభించారు. ఇవి ఎలాంటి ఉగ్రదాడినైనా తట్టుకోగలవు. ఇందులోనూ అమెరికా అధ్యక్షుని అత్యవసర  వైద్యం కోసం ఏర్పాట్లు చేశారు. కాన్వాయ్ లో ఉండే రెండు కార్లకు ఒకే నంబర్ ప్లేట్ ఉండడం మరో విశేషం. అది కూడా వాషింగ్టన్ డీసీ లో లైసెన్స్ కలిగిన 800-002 అనే నంబర్ ప్లేట్ తో రెండు వాహనాలు ఉంటాయి.


ఇక అమెరికా అధ్యక్షున్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు 'మెరైన్ వన్' కూడా అందుబాటులో ఉంటుంది. దీన్ని అమెరికా మెరైన్ కార్ప్స్ నిర్వహిస్తుంది. ఇందులో   Sikorsky VH-3D Sea Kings, VH-60N White Hawks అనే రెండు విభాగాలు ఉన్నాయి. మెరైన్ వన్  కూడా  ఎయిర్ ఫోర్స్ వన్, ద బీస్ట్ లాగే  యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను కలిగి ఉంది. మొత్తంగా ప్రెసిడెంట్  విమానంతో పాటు గాలిలోకి ఐదు హెలికాప్టర్లు ఎగురుతాయి. పరస్పరం కమ్యూనికేట్ చేసుకుంటాయి. 

మొత్తంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం భారత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆయన భారత పర్యటనలో సబర్మతిలోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ముఖేష్ అంబానీ, ఎన్. చంద్రశేఖరన్, సునీల్ భారతీ మిట్టల్, ఆనంద్ మహీంద్రా లాంటి కార్పొరేట్ వ్యక్తులను కలుస్తారు. కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియం నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దాదాపు లక్ష మందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చివరకు వెళ్లే రోజు ఆయన ఆగ్రాలోని తాజ్ మహల్ ను  కూడా సందర్శించనున్నారు.

 

Trending News