YS Sharmila Takes a dig at Niranjan Reddy: తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని ప్రశ్నించడం వారి మనోభావాలను దెబ్బతీసినట్టు ఎలా అవుతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ విప్‌లు.. తనపై ఫిర్యాదు చేయడంపై షర్మిల విస్మయం వ్యక్తంచేశారు. గత 151 రోజులుగా 2 వేల కిలో మీటర్ల పాటు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నానని.. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలే తమ దృష్టికి తీసుకు వస్తున్నారని షర్మిల అన్నారు. అభివృద్ది పేరు చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడటం తప్ప... మాకేం ఒరిగింది లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు షర్మిల తెలిపారు.
అప్పులు చేసి గెలిచిన మీకు వేల కోట్లు ఎక్కడివి..
2014 ఎన్నికలకు ముందు అప్పులు చేసి మరి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వేల కోట్లకు ఎలా పడగలెత్తారో చెప్పాలంటూ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. తెలంగాణ సంపద మొత్తం అధికార పార్టీకి చెందిన నేతల జేబుల్లోకే పోయిందని.. ప్రజలకు రూపాయి మందం కూడా పథకాల రూపంలో అందింది లేదని షర్మిల మండిపడ్డారు. ఇంతకాలం తెలంగాణ గడ్డమీద ప్రతిపక్షం బలంగా లేకపోవడమే మీ ధనదాహానికి కారణం అయ్యిందని... ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటూ అవినీతికి పాల్పడిన నేతలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందని షర్మిల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు.
అందుకే నన్ను చూసి భయపడుతున్నారు..
ప్రశ్నించాల్సిన బీజేపి, కాంగ్రెస్ పార్టీలు మీకు అమ్ముడు పోవడంతోనే అధికార పార్టీ నేతలు వేల కోట్లు వెనకేశారని... ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తాను దిగి అన్ని బయటపెడుతుంటే వారి భూ కబ్జాలు, అవినీతి బాగోతాలు అన్ని బయటపడతాయోమోననే భయంతో ఎదురుదాడికి దిగుతున్నారని షర్మిల ఆరోపించారు. ఆ కారణంగానే తనపై దురుద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కి పిర్యాదులు చేసినట్లు షర్మిల అభిప్రాయపడ్డారు.
మరి నిరంజన్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్‌ల సంగతేంది..
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నాపై చర్యలకు ఆలోచన చేసే ముందు... మీకు పిర్యాదు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి నన్ను మంగళవారం మరదలు అని అసభ్య పదజాలంతో దూషించారని.. పరాయి స్త్రీ , ఒక తల్లిని అయిన నన్ను అలాంటి మాటలు మాట్లాడినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల స్పీకర్ పోచారంకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కేసీఆర్ ప్రతిపక్షాలపై పచ్చి బూతులు తిట్టారని... ఇక మంత్రి కేటీఆర్ సైతం నిరుద్యోగుల కోసం చేస్తున్న మంగళవారం దీక్షలను వ్రతాలతో పోల్చి మహిళాలోకాన్ని కించపరిచినందుకు ఆయనపై సైతం చర్యలు తీసుకోవాలని సూచించారు. తనపై అధికార పార్టీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా... తన పాదయాత్రను అడ్డుకోవాలని చూసినా... పోలీసులను పనోళ్లుగా వాడుకొని తమకు ఇబ్బందులు పెట్టాలని చూసినా.. ఇలా ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తన పాదయాత్రను మాత్రం అడ్డుకోలేరని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.
Also Read : VRAs Chalo Assembly: తెలంగాణ ఇంటలిజెన్స్ ఫెయిల్యూరా ? లేక వీఆర్ఏలే అని లైట్ తీసుకున్నారా ?
Also Read : TS Assembly Sessions 2022: తెలంగాణ అసెంబ్లీలో కేంద్రాన్ని ఏకిపారేసిన మంత్రి హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి