హైదరాబాద్ : పోలింగ్ బూత్స్‌లోకి సెల్ ఫోన్ అనుమతించేది లేదనే నిబంధనను ఉల్లంఘించిన ఓ యువకుడు అక్కడే ఓటు వేస్తూ ఓ సెల్ఫీ తీసుకుని అరెస్ట్ అయిన ఘటన శుక్రవారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఎన్నికల నిబంధన ఉల్లంఘన ప్రకారం ఆ యువకుడిపై ఐపీసీ సెక్షన్ 188 ( విధుల్లో భాగంగా ఓ ప్రభుత్వ అధికారి జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించిన నేరం) కింద కేసు నమోదైంది. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకెళ్తే.. ఉప్పర్‌పల్లి ప్రాంతానికి చెందిన శివ శంకర్ 125వ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్లాడు. ఓటు వేస్తున్న సమయంలోనే అన్ని సందర్భాల్లోని అలవాటు ప్రకారమే పోలింగ్ బూత్‌లో ఓ సెల్ఫీ తీసుకున్నాడు.
శివ శంకర్ సెల్ఫీ తీసుకుంటుండటాన్ని గమనించిన ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అక్కడే విధుల్లో వున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు మేరకు శివ శంకర్‌ని అదుపులోకి తీసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు అతడిపై సెక్షన్ 188 కింద కేసును నమోదు చేశారు. తెలియక చేసిన తప్పిదం ఎంత ఇరకాటంలో పడేసిందని ఆ తర్వాత జుట్టు గోక్కోవడం శివ శంకర్ వంతయ్యింది.