హైదరాబాద్: జంటనగరాల్లో మద్యం దుకాణాలు డ్రా పద్దతిలోనే కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఎక్సైజ్ పాలసీ నవంబరు 1 నుంచి అమలులోకి రానుందని.. అప్పటి నుంచి 31-10-2021 వరకు రెండు సంవత్సరాల కాల పరిమితితో లైసెన్స్‌లు కేటాయిస్తారని అధికారులు వెల్లడించారు. బుధవారం దీనిపై నోటిఫికేషన్ వెలువడనుండగా ఆ తర్వాత వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నారు. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించిన అనంతరం 18న నగరంలోని అంబర్‌పేటలోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటల నుంచి డ్రా ప్రక్రియ ప్రారంభం కానుంది.
హైదరాబాద్‌లో 94, సికింద్రాబాద్‌లో 79 చొప్పున జంటనగరాల్లో మొత్తం 173 రిటైల్ మద్యం దుకాణాలకుగాను లైసెన్స్‌లు జారీచేయనున్నట్టు డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి తెలిపారు. నూతన మద్యం పాలసీ కింద ఒక మద్యం దుకాణానికి ఏడాదికి రూ. 1.10కోట్లు లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని.. అలా రెండేళ్లకు కలిపి రూ 2.20 కోట్లు అవుతుందని అన్నారు.