Vemulawada Rajanna Temple: తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సాక్షిగా కొంతమంది అధికారులు ప్రభుత్వానికి పంగ నామం పెట్టి పరోక్షంగా ప్రజాధనాన్ని, తమకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది అధికారులు వ్యవహరిస్తోన్న తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఆలయంలో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బందిని కొంత మంది అధికారులు తమ ఇళ్ళలో సొంత పనులకు వాడుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చాలాకాలంగా జరుగుతున్న ఈ దోపీడి తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజన్న ఆలయంలో పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తోన్న కొంతమంది సిబ్బందిని అదే విభాగానికి చెందిన సూపరింటెండెంట్ తన ఇంట్లో పనులకు వాడుకున్నాడు. అది సరిపోదు అన్నట్లు పి.ఆర్.ఓ విభాగానికి చెందిన మరో ఉద్యోగి ఇంట్లో ఉన్న వ్యక్తిగత అవసరాలకు సైతం కొంతమంది ఆలయం సిబ్బందిని పంపించి పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సదరు అధికారుల తీరు తాజాగా విమర్శల పాలవుతోంది. ఆలయ పాలనను చక్కదిద్దాల్సిన సూపరింటెండెంట్ స్థాయి అధికారే తన ఇంట్లో ఆలయ సిబ్బందితో వెట్టి చాకిరి చేయించుకోవడం, అందులోనూ షిఫ్టుల పద్దతిలో సిబ్బందిని తన ఇంట్లోకి పిలుపించుకొని పనులు చేయించుకోవడం విస్మయానికి గురి చేస్తోంది.
అయితే ఎప్పటి నుండో సూపరింటెండెంట్ వ్యవహార శైలిని చూస్తూ వస్తున్న సిబ్బందికి రాను రాను ఆయన ఆగడాలు మితిమీరిపోవడంతో సూపరింటెండెంట్ ను వ్యతిరేకించడం మొదలు పెట్టారు. విషయాన్ని ఈవో దృష్టికి తీసుకువెళ్తామని చెప్పినట్లు, ఈ క్రమంలో అలా వ్యతిరేకించిన సిబ్బందిని సూపరింటెండెంట్ డ్యూటీలో ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిసింది. దీంతో చేసేదేమీ లేక పనికి వెళ్లిన వారిలో నుండి ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఫోన్ చేసి సూపరింటెండెంట్ తీరును, వారి ఇంట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను, చేసిన పనులను ఆవేదనతో వెళ్లగక్కాడు. ఆ ఇద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ కాస్తా ఫోన్ లో రికార్డ్ అవడం.. అది కాస్తా లీకై విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా చాలా రోజుల నుండే ఈ తతంగం నడుస్తోందని, కానీ చెప్పడానికి సిబ్బంది భయపడినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొంత మంది అధికారుల ఇళ్లల్లోనూ ఇలాంటివి నిత్యం జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఆలయంలో పని చేసే సిబ్బందిని తమ ఇండ్లల్లో సొంత పనులకు వాడుకోవడం సరైనది కాదని, అందులోనూ వెట్టి చాకిరి మాదిరిగా పనులు చేయమనడం దారుణమనే వాదనలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఈ తతంగం అంతా జరుగుతున్నప్పటికీ.. ఆలయ ఈ.ఓ, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనే ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.