హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు అవకతవకలపై నిరసన వ్యక్తంచేస్తూ తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలన్ని ఏకమై ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఆందోళన రసాబాసగా మారింది. దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో నేత నగేష్ ముదిరాజ్ మధ్య కుర్చీల కోసం జరిగిన ఘర్షణ కాస్తా ఒకరినొకరు వేదికపైనే తోసుకునే వరకు వెళ్లింది. ఈ తోపులాటలో టీపీసీసీ సెక్రటరీ నగేష్ ముదిరాజ్ వేదికపై నుంచి కిందపడిపోగా అనంతరం నగేష్ కూడా వీహెచ్‌ను కిందకు లాగడంతో ఆయన కూడా కింద పడిపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్డ్ కుంతియా సమక్షంలోనే ఈ ఘర్షణ చోటుచేసుకోవడం గమనార్హం. అక్కడే వున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఇరువురు నేతలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన కోదండరామ్, నారాయణ రంగంలోకి దిగి వారికి నచ్చచెప్పినట్టు తెలుస్తోంది.
ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌కి వ్యతిరేకంగా విపక్షాలన్ని ఏకమై చేపట్టిన ఆందోళన కాస్తా కుర్చీల కొట్లాటగా మారిన వైనం అక్కడున్న వారిని విస్తుపోయేలా చేసింది.