Amit Shah Speech at Khammam Public Meeting: నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి, స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి నమస్కారాలు అంటూ ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగించారు. ఖమ్మంలో తెలంగాణకు రాగానే.. తెలంగాణ విమోచన దినోత్సవ 75వ వేడుకలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తెలంగాణలో అక్రమ, అవినీతి, కుటుంబ పాలకులు, రజాకార్ల మద్దతుతో కొనసాగుతున్న కల్వకుంట్ల ప్రభుత్వానికి తిరోగమనం మొదలైందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. తెలంగాణ విమోచన సంగ్రామంలో నాటి తెలంగాణ యువత ప్రాణత్యాగం చేశారని.. కానీ మీరు 9 ఏళ్లుగా రజాకార్ల పార్టీతో అంటకాగుతూ.. నాటి ప్రజల త్యాగాలకు విలువలేకుండా చేశారని అన్నారు.
"ఖమ్మం ప్రజలారా.. నా మాట గుర్తుంచుకోండి.. ఎన్నికలు వస్తున్నాయి. కేసీఆర్ ఓడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి రానుంది. భద్రాచలానికి దక్షిణభారతపు అయోధ్యగా పేరుంది.. భద్రాచల మందిర నిర్మాణం కోసం భక్తరామదాసు పడిన పాట్లు.. నిజాం ఏలుబడిలో జైలుపాలయ్యేందుకు కూడా సిద్ధమయ్యాడు. 17వ శతాబ్దం నుంచి తెలంగాణలో ఎవరు పాలించినా.. రామనమవి నాడు.. ప్రభుత్వం తరపున భద్రాచలం రాముడి కల్యాణ రాముడికి వస్త్రాలు సమర్పించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. కానీ కేసీఆర్.. ప్రభుత్వంలో మాత్రం.. కారు..భద్రాచలం వరకు వస్తుంది. కానీ మందిరంలోకి కారు వెళ్లకుండా.. ఆగుతోంది. ఎందుకంటే మందిరంలోకి వెళ్తే మిత్రుడికి బాధ కలుగుతుందనే ఆలోచన ఆయనది. కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. మీ పని అయిపోయింది.
రేపు బీజేపీ ప్రభుత్వం రాగానే.. మా సీఎం ఎవరున్నా.. కమల పుష్పాన్ని భద్రాచల రాముడి పాదపద్మముల ముందు అర్పిస్తాం. కేసీఆర్ భద్రాచలం ఇక రావాల్సిన అవసరం లేదు. స్టీరింగ్ చేతుల్లోలేని కేసీఆర్ కారు.. మనకు అవసరం లేదు. వచ్చే ప్రభుత్వం.. నరేంద్ర రమోదీ గారి ఆశీస్సులతో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. అందులో సందేహం లేదు. బీజేపీ నేతల మీద దౌర్జన్యాలు, అక్రమ నిర్బంధాలు చేస్తే, బెదిరింపులకు గురిచేస్తే.. వాళ్లు వెనక్కు తగ్గుతారని అనుకుంటున్నారు. మా కిషన్ రెడ్డిని, మా బండి సంజయ్‌ను, మా ఈటల గారిని అడ్డుకుంటే.. మేం వెనక్కు తగ్గం.. కేసీఆర్ నీ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు.
కాంగ్రెస్ పార్టీ 4జీ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీ.. 2జీ పార్టీ.. మజ్లిస్ పార్టీ.. 3జీ పార్టీ.. ఇప్పుడు ఈ 2జీ, 3జీ, 4జీ పార్టీలకు కాలం చెల్లింది. తెలంగాణలో వచ్చేది బీజేపీ పార్టీయే. పేదలకు ఇండ్లు, యువతకు ఉద్యోగాలు, దళితులకు ఆర్థికంగా భరోసా ఇస్తానన్నాడు.. రైతులకు మరో హామీ.. ఇలా అబద్ధపు హామీలు ఇవ్వడం తప్ప కాలం వెల్లదీస్తున్నాడు తప్ప పేదలకు ఏమీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ.. ఆనాడు రైతులకోసం 22వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఇవాళ మోదీ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. లక్షా 28 వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం 7 లక్షల కోట్ల అప్పులు, ఇతర సబ్సిడీలిస్తే.. మోదీ ప్రభుత్వం20 లక్షలకోట్ల విలువైన సహాయ సహకారాలు అందిస్తోంది.
ధాన్యం సేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 475 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేది. మోదీ ప్రభుత్వం 900 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించింది. బియ్యం మీద కనీస మద్దతు ధర 67శాతం పెరిగింది. 11 కోట్ల మంది రైతులకు, 2.60 లక్షల కోట్ల కిసాన్ సమృద్ధి నిధిని అందిస్తోంది. 10 వేల ఎఫ్‌పీఓలను ఏర్పాటుచేసే పని మోదీ ప్రభుత్వం చేస్తోంది.
నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని అంటున్నాడు. కేసీఆర్.. గుర్తుపెట్టుకో.. ఏం జరిగినా.. ఒవైసీ, కేసీఆర్‌తో బీజేపీ పార్టీ.. పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు. బీజేపీ ఎప్పుడైనా ఒవైసీతో కలుస్తుందా..? బీఆర్ఎస్‌తో కలుస్తుందా..? ఈ రెండు పార్టీలతో కనీసం వేదిక కూడా పంచుకునే పరిస్థితి లేదు. అలాంటిది వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే ఆలోచన అర్థరహితం.." అని అమిత్ షా అన్నారు. ఈ రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువత వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపి.. బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
Amit Shah: కేసీఆర్ నీ కొడుకు సీఎం అయ్యే ప్రసక్తే లేదు.. నిప్పులు చెరిగిన అమిత్ షా