హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను సెక్షన్ 24 ప్రకారం చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని తెలంగాణ సర్కార్ చేసిన విజ్ఞప్తిని హై కోర్టు తోసిపుచ్చింది. ఆర్టీసీ సమ్మె చట్టపరమైనది కాదని మేము ఆదేశించలేమన్న హైకోర్టు.. సమ్మె చట్టబద్దమా కాదా అని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉందని స్పష్టంచేసింది. అదే సమయంలో కార్మికులు కోరుతున్నట్టుగా వారితో చర్చలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని సైతం ఆదేశించలేమని కోర్టు అభిప్రాయపడింది. అయితే, చర్చలు చేపట్టమని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించలేని పక్షంలో.. కనీసం చర్చల దిశగా చర్యలు తీసుకునెల అయినా ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా టిఎస్ఆర్టీసీ జేఏసి తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి కోర్టును కోరారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను హై కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేసిన న్యాయవాది ప్రకాష్ రెడ్డి.. కార్మికులు 45 రోజులుగా సమ్మె చేస్తున్నారని.. సమ్మె కారణంగా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని కోర్టుకు తెలిపారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతున్నందున మానవతా దృక్పథంతో పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఓవైపు కార్మికులు సమ్మెలో ఉండి తిప్పలు పడుతోంటే.. మరోవైపు ప్రభుత్వం మాత్రం టెంపరరీ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ యాక్సిడెంట్లు చేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.