మరో ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్య, మృతదేహంతో ర్యాలీ, పరిస్థితి ఉద్రిక్తం

మరో ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్య, మృతదేహంతో ర్యాలీ, పరిస్థితి ఉద్రిక్తం

Last Updated : Nov 13, 2019, 07:05 PM IST
మరో ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్య, మృతదేహంతో ర్యాలీ, పరిస్థితి ఉద్రిక్తం

మహబూబాబాద్: టీఎస్ఆర్టీసికి చెందిన మరో డ్రైవర్ నేడు ఉదయం ఆత్మహత్య చేసుకోవడం మహబూబాబాద్‌లో కలకలం సృష్టించింది. ఆర్టీసీ సమ్మె అనంతరం చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు, హై కోర్టులో పిటిషన్ తీర్పు ఏ విధంగా వస్తుందోననే ఆందోళనలతో మనస్తాపానికి గురైన నరేష్ అనే డ్రైవర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరేష్ పురుగుల మందు తాగడం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేశ్‌ మృతిచెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు వున్నారు. 2007 నుంచి ఆర్టీసీలో విధులు నిర్వర్తిస్తున్న నరేష్ ఆత్మహత్య చేసుకోవడంతో అతడి తోటి ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

డ్రైవర్‌ నరేశ్‌ మృతదేహంతో కార్మికులు, నేతలు మహబూబాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నరేష్ మృతికి ప్రభుత్వమే కారణమంటూ నిరసనకు దిగారు. ఆస్పత్రి నుంచి బస్ డిపో వరకు ర్యాలీ చేపట్టి అనంతరం డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన కార్మికులు, వారి మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేం లేక కార్మికులు బస్సు డిపో ఎదుటే బైఠాయించి.. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో మహబూబాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అనారోగ్యంతో బాధపడుతున్న నరేష్ భార్య..
మృతుడు నరేష్ భార్య గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండటం... ఆమె వైద్య చికిత్స, మెడిసిన్‌కే నెలకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతున్నాయని.. మరోవైపు పిల్లల చదువుతో నరేశ్‌ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నరేశ్‌ తాజాగా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో తట్టుకోలేకపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. 

ఆత్మహత్య వార్త తెలుసుకున్న కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల మొండి వైఖరితో వ్యవహారిస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం వైఖరి కారణంగా ఆర్టీసీ కార్మికులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నట్టు ఆరోపించారు.

Trending News