ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

అకస్మాత్తుగా ఇంజిన్‌ నుంచి పొగలుకక్కిన ఆర్టీసీ బస్సు

Last Updated : Oct 21, 2019, 01:21 AM IST
ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

వరంగల్‌: జిల్లాలోని మడికొండ సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. హన్మకొండ నుంచి తరిగొప్పుల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. అకస్మాత్తుగా ఇంజిన్‌ నుంచి పొగలుకక్కడం ప్రారంభించింది. ఇంజిన్‌లో ఏదో సాంకేతిక లోపం తలెత్తిందని గుర్తించిన బస్సు తాత్కాలిక డ్రైవర్.. వెంటనే పోలీస్‌ ట్రైనింగ్ సెంటర్‌ సమీపంలో బస్సును రోడ్డు పక్కకు నిలిపేసి ప్రయాణికులను దిగిపోవాల్సిందిగా సూచించారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనతో బస్సు దిగి దూరంగా పరుగెత్తారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయమార్గాలు అన్వేషించాల్సిందిగా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు తాత్కాలిక డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లతో ఎలాగోలా బస్సులు నడిపిస్తున్న డిపో మేనేజర్లను.. ఆ బస్సుల నిర్వహణ, మరమ్మతులు చూసుకునే మెకానిక్‌ల కొరత వేధిస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన మెకానిక్‌లను తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లకు మరమ్మతులు చేసే నైపుణ్యం, అనుభవం ఉన్న అభ్యర్థులే కరువయ్యారని హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఓ డిపో మేనేజర్ ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. తాత్కాలిక ప్రాతిపదికన మెకానిక్‌లను ఇంటర్వ్యూకు ఆహ్వానించినప్పటికీ.. చేతిలో సర్టిఫికెట్ తప్ప సరైన అనుభవం ఉన్న అభ్యర్థులు ఎవ్వరూ ఇంటర్య్వూకు రాలేదని,  అనుభవం కలిగిన మెకానిక్‌ల పర్యవేక్షణ లేకుండానే రోడ్లపైకి వస్తోన్న ఆర్టీసీ బస్సులు ఎక్కడ ప్రమాదం బారిన పడతాయోనని భయమేస్తోందని సదరు డిపో మేనేజర్ ఆవేదన వ్యక్తంచేశారు. 

ఓవైపు అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్ల చేతిలో బస్సు స్టీరింగ్, మరోవైపు నైపుణ్యం కలిగిన మెకానిక్‌ల పర్యవేక్షణ లేకుండానే రోడ్లపైకి వస్తున్న బస్సులు పలుచోట్ల ప్రమాదాల బారిన పడుతున్న తీరు.. ఆయా ప్రమాదాల్లో ప్రాణ నష్టం సంభవిస్తున్న వైనం తమను ఆందోళనకు గురిచేస్తోందని ప్రయాణికులు సైతం వాపోతున్నారు.

Trending News