హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇదివరకు నిర్వహించిన రాత పరీక్ష మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఈ ఖాళీలను భర్తీ చేయాలని సూచించిన సర్కార్.. సదరు మెరిట్ లిస్ట్‌ను సంబంధిత జిల్లాలకు పంపాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేసింది. ప్రతీ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి లేదా జూనియర్ పంచాయతీ కార్యదర్శిల్లో ఎవరో ఒకరు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసిన సర్కార్.. స్థానికతకు సంబంధించి గతేడాది హైకోర్టు స్టే విధించిన పోస్టులు మినహా అన్నింటినీ భర్తీ చేయాలని కలెక్టర్లకు జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా 9,355 మందిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా అప్పట్లో ప్రభుత్వం ఎంపిక చేసినప్పటికీ.. వారిలో 1300 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో అసలు నియామక ఉత్తర్వులు తీసుకోవడానికే ఆసక్తి చూపలేదు. ఇదిలావుంటే, ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలోనే 356 మంది రాజీనామా చేయగా, ఇంకొందరు సెలవులపై వెళ్లారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,100 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్కార్ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.