దేశంలో జీవించేందుకు అత్యంత సౌకర్య, సురక్షిత నగరంగా పేరున్న హైదరాబాద్లో వాహనాలకు మాత్రం భద్రత కరువైంది. నిత్యం రాష్ట్రంలో ఏదో ఓ చోట ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు.. కొన్ని చోట్ల లారీలు కూడా మాయమైపోతున్నాయి. గత మూడు సంవత్సరాలలో 12 వేలకు పైగా వాహనాలు చోరీకి గురైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వాహన దొంగతనం కేసుల్లో నగర, పొరుగు జిల్లాల పోలీసులు నామమాత్ర దర్యాప్తు చేస్తుండటంతో పోయినవాటిపై బాధితులు ఆశలు వదులుకుంటున్నారు. ఇదే దొంగలకు వరంగానూ మారుతోంది. మొత్తం చోరీ వాహనాల్లో 80 శాతం బైకులే ఉండగా.. 20 శాతం కార్లు ఉన్నాయి.
పట్టుబడ్డవి దొంగ వాహనాలా? అయితే వాటి అసలు యజమానులు ఎవరు? ఎక్కడ చోరీకి గురయ్యాయి? తదితర వివరాలను పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా అలా చేసిన దాఖలాలు లేవు. పైగా దొరికిన వాహనాలు దర్యాప్తు పూర్తయ్యే వరకూ స్టేషన్లలో మూలాన పడి ఉండాల్సిందే! మరికొన్ని కేసుల్లో చోరీ వాహనం దొరికినా కేసు చార్జిషీట్ దశలో ఉందని, కోర్టు ద్వారా తీసుకోవాలని పోలీసులు చెబుతుండటంతో బాధితులు ఆశలు వదులుకుంటున్నారు.
మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకు చెందిన గ్యాంగులు వాహనాలను చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాలకు స్థానిక ముఠాలు ఆశ్రయం కల్పించడం, వాహనాలు రాష్ట్రం దాటించడం చేస్తూ దోపిడీ సొత్తులో వాటా పంచుకుంటున్నాయి. చోరీకి గురైన వాహనాల సొత్తును లెక్కేస్తే కార్లు, బైకులు, ఆటోలు మొత్తం కలిపి రూ.100 కోట్ల వరకు ఉంటుందని పోలీస్ శాఖ ఏటా వెలువరించే వార్షిక నివేదికల్లో తెలుస్తోంది.