ఆచార్య జయశంకర్‌కు తెలంగాణ ఘన నివాళి

తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ వర్థంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళిని అర్పించింది.

Last Updated : Jun 21, 2018, 05:33 PM IST
ఆచార్య జయశంకర్‌కు తెలంగాణ ఘన నివాళి

తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ వర్థంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళిని అర్పించింది. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయితీ రాజ్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియా వేదికగా జయశంకర్‌కు నివాళులు అర్పించారు.  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కేసీఆర్‌‌కు సలహాదారుగా, మార్గదర్శిగా జయశంకర్ వ్యవహరించారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు గ్రంథాలు రచించారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన జయశంకర్,  1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పనిచేశారు. 

విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన జయశంకర్ 1954 ప్రాంతంలోనే విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టారు. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ.. ఆ దిశగా పలు రచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కళ్ళారా చూడాలని చెప్పే జయశంకర్ 2011, జూన్ 21 తేదిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. 

 

Trending News