Telangana Gruha Jyothi Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఒక్కొక్కటిగా ఆరు గ్యారంటీ పధకాలు అమలవుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్ పధకాలు ప్రారంభం కాగా ఇప్పుడు గృహజ్యోతి పథకం మొదలైంది. అంటే గృహ వినియోగదారులు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఈ పధకం ఎలా వర్తిస్తుంది, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలనేది పరిశీలిద్దాం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పధకాన్ని ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పధకాల్లో ఇదొకటి. ఈ పధకం ప్రకారం నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడితే బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అంటే విద్యుత్ శాఖ సదగరు వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేస్తుంది. ఈ పధకం ప్రారంభించినప్పట్నించి ఇప్పటి వరకూ 40 లక్షల 33 వేల 702 ఇళ్లకు ఈ పధకం వర్తింపజేసింది. వైట్ రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, కరెంట్ కనెక్షన్ వివరాలు సక్రమంగా ఉంటేనే ఈ పధకం వర్తిస్తుంది. ఈ పధకం వర్తించాలంటే కేవలం 200 యూనిట్లలోపు వినియోగం ఒక్కటే సరిపోదు. ప్రభుత్వం కోరిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. వైట్ రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు వాడినా జీరో బిల్లు కాకుండా సాధారణ బిల్లు వస్తే ఆ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తులు సమీపంలోని మండల పరిషత్, మున్సిపల్, విద్యుత్, రెవిన్యూ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇలా ఇప్పటివరకూ 45 వేలమందికి రివైజ్డ్ బిల్లులు జారీ అయ్యాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక విద్యుత్ సరఫరా మరింత పెరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అదే సమయంలో సగటు వినియోగదారుడి విద్యుత్ వినియోగం కూడా పెరిగిందన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో 263 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగముంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో 272 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామన్నారు. మార్చ్ నెలలో రోజుకు సరాసరిన 295 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ డిమాండ్ కూడా 16వేల 500 మెగావాట్లకు పెరిగిందన్నారు.
ఇప్పటికీ 200 యూనిట్ల లోపు వినియోగిస్తూ జీరో బిల్లు జారీ కానివారు తక్షణం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. దీనికోసం వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అడ్రస్ వంటి వివరాలు పక్కాగా సమర్పించాల్సి ఉంటుంది. వైట్ రేషన్ కార్డు ఉండి 200 యూనిట్లలోపు వినియోగించేవారికి సాధారణ బిల్లు వస్తుంటే ఆ బిల్లు కట్టవద్దని కూడా ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు. తక్షణం గృహజ్యోతి కోసం అప్లై చేసుకుంటే రివైజ్ బిల్లు జారీ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook