జాతీయ స్థాయిలో వివిధ రంగాలు, విభాగాల్లో ఉత్తమ సేవలు అందించి, ఉత్తమమైన ప్రతిభ కనబర్చిన సంస్థలు, అధికార యంత్రాంగాలకు అందించే స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులలో ఐదు అవార్డులు తెలంగాణను వరించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'పల్లె ప్రగతి' ప్రాజెక్టును (Palle Pragathi project) విజయవంతంగా అమలు చేసినందుకుగాను రాష్ట్రానికి ఓ స్కాచ్ అవార్డు దక్కింది.
ఈ కార్యాలయం ప్రాజెక్టులో (e-office project) భాగంగా 100% కాగిత రహిత కార్యాలయాన్ని (Paperless office) నిర్వహించిన నారాయణపేట జిల్లా రెండు ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులు సొంతం చేసుకుంది.
అలాగే వర్షపు నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, జీవనోపాధికి భద్రత వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన కామారెడ్డి జిల్లా సైతం రెండు అవార్డులు కైవసం చేసుకుంది. ఢిల్లీలో శనివారం జరిగిన స్కాచ్ అవార్డుల ప్రధానోత్సవంలో సంబంధిత శాఖల అధికారులకు ఈ పురస్కారాలను అందించారు.